వీరి మోసం రియల్

12 Dec, 2014 02:44 IST|Sakshi
వీరి మోసం రియల్

మంచిర్యాల రూరల్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో మంచిర్యాల జిల్లా కావాలని కోరుతున్న తూర్పు జిల్లా వాసుల ఆకాంక్ష మేరకు ఇటీవలే సీఎం కేసీఆర్ నూతన జిల్లాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. మంచిర్యాలను కూడా జిల్లా చేస్తారంటూ వస్తున్న వార్తలు తూర్పు జిల్లా ప్రజలకు ఊరటనిస్తుండగా, రియల్టర్లకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో జిల్లా ఏర్పాటు విషయమేమోగానీ రియల్టర్లకు మాత్రం మంచి లాభాలే వచ్చిపడుతున్నాయి. మంచిర్యాల పరిధిలోని గ్రామాల్లో కనిపించిన ప్రతి వ్యవసాయ భూమిని ఎలాంటి అనుమతి లేకుండానే లేఔట్లుగా మలుస్తున్నారు. దీంతో రియల్టర్లు కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు.

మంచిర్యాలను జిల్లాగా ప్రకటిస్తే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు వందల ఎకరాల ప్రభుత్వ భూమి కావాల్సి ఉంది. మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌తోపాటు, చుట్టు పక్కల మొత్తంగా 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు అంచనా వేసి, సర్వే కూడా చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకున్నా, ఇదే అదునుగా రియల్టర్లు మాత్రం గుడిపేట సమీపంలో గల ముల్కల్ల, వేంపల్లి, గుడిపేట, హాజీపూర్‌తోపాటు నస్పూరు, తీగల్‌పహాడ్ గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా లేఔట్లు చేసి ప్లాట్లను అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే అవుతాయంటూ మభ్యపెడుతూ రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నుంచి.. గ్రామపంచాయతీల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి అమ్మడంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు మాత్రం తప్పేలా లేవు.
 
నిబంధనలకు తూట్లు..
మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపునకు వెళ్లే దారిలోని వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, నస్పూరు, హాజీపూర్ గ్రామాల్లోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వందల ఎకరాల్లోని పచ్చని పంట పొలాలుగా ఉన్న వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారాయి. మంచిర్యాల పట్టణం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారికి ఆనుకుని 14కి పైగా అక్రమ లేఔట్లు వెలిశాయి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు గాను రెవెన్యూ డిపార్టుమెంటుకు చెల్లించాల్సిన వన్‌టైం నాలా పన్ను మాత్రమే చెల్లిస్తూ, లేఔట్ అనుమతులను పొందకుండా, గ్రామపంచాయతీకి కట్టాల్సిన పన్ను కట్టకుండానే ప్లాట్లు విక్రయిస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చిన అనుమతి పత్రాన్ని చూపి గ్రామపంచాయతీకి భూమి విలువలో 5 శాతం సెక్యూరిటీ డిపాజిట్ కింద జీపీ ఖాతాలో జమచేయాలి.

భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల పత్రాలు, ఆర్డీవో ద్వారా చేయించిన ల్యాండ్ కన్వర్షన్ పత్రం, టౌన్ ప్లానింగ్ పేరున రూ.1000 ఇన్‌స్పెక్షన్ రుసుము చెల్లించాలి. మూడు కాపీల లేఔట్ ప్లాన్ (అప్రూవల్) కాపీలు ఇవ్వాలి. ప్లాట్లు వేసే సమయంలో రోడ్డు వెడల్పు 33 ఫీట్లు వేయాలి. డ్రెయినేజీ, విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో పాటు, అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టాలి. మొత్తం ప్లాట్లలో 30 శాతం భూమిని రోడ్లకు, 10 శాతం భూమిని గ్రామపంచాయతీ అవసరాలకు, 60 శాతం భూమిని ప్లాట్లుగా చేసుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ.. రియల్టర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. అనుమతి పత్రంతోపాటు, జీపీకి కట్టిన చలానాను జతచేస్తూ లేఔట్ కోసం జిల్లా పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నా, అవి చేయకుండానే ప్లాట్లను అమ్ముకుంటున్నారు.
 
ప్రభుత్వ ఆదాయానికి గండి..

మండలంలో 14 వరకు అక్రమంగా లేఔట్లు చేసిన 100 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. పంచాయతీ అధికారులు గతంలోనే వేంపల్లిలో 57 ఎకరాలు, ముల్కల్లలో 7 ఎకరాలు, గుడిపేటలో 10 ఎకరాలు, హాజీపూర్‌లో ఎకరం భూమిలో ప్లాట్లు చేసిన వారికి నోటీసులు అందించారు. ఇప్పటి వరకు ఆయా భూ యజమానులు గ్రామ పంచాయతీల అనుమతిని మాత్రం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. మంచిర్యాలకు సమీపంలో, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్లాటు గుంటకు రూ.10 లక్షలు ఉండగా, రోడ్డు నుంచి కొంత లోపల ఉన్న భూమి గుంటకు రూ.5 లక్షల వరకు ధర పలుకుతోంది.

100 ఎకరాల్లో గ్రామపంచాయతీ అనుమతి తీసుకుంటే, పది శాతం భూమిని అంటే 10 ఎకరాల భూమిని గ్రామపంచాయతీకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే గుంట భూమికి సరాసరి రూ.5 లక్షలు వేసుకున్నా, పంచాయతీలకు కేటాయించే 10 ఎకరాల భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.20 కోట్లు ఉంటుంది. అనుమతికి ఎకరాకు లేఔట్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ పేర రూ.12 వేల చొప్పున చెల్లిస్తే, రూ.12 లక్షలు గ్రామపంచాయతీకి కట్టాల్సి వస్తుంది.

అనుమతులు తీసుకోవాలని పంచాయతీ అధికారులు నోటీసులు ఇస్తుండగా, గడువు కోరుతూ ప్లాట్ల విక్రయాలు చేపడుతున్నారు. గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన 10 శాతం భూమిని సైతం అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములను ఎకరాకు రూ.10 నుంచి 15 లక్షల ధరతో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ, ప్లాట్లుగా చేసి రూ.1.80 కోట్లకు అమ్ముకుంటున్నారు. ఈ లెక్కన చూసినా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనూ ఆదాయానికి గండి పడుతోంది. రిజిస్ట్రేషన్లు, జీపీకి పదిశాతం భూమి, లేఔట్ అనుమతి ఫీజులను కలుపుకుంటే రూ.22 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లే. లేఔట్లలో డ్రెయినేజీలు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు వేయడం వంటి మౌలిక సదుపాయాలు కల్పించక పోవడంతో, భవిష్యత్తులో గ్రామపంచాయతీలకు భారం పడే అవకాశం ఉంది.
 
జీపీ నుంచి అనుమతులు ఉండవు
- శంకర్, ఈవోపీఆర్డీ మంచిర్యాల

నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన లేఔట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వరు. అలాగే ఎలాంటి అభివృద్ధి పనులు ఆయా లేఔట్లలో చేపట్టరు. కొనుగోలుదారులు అనుమతులు లేని లేఔట్లలో స్థలాలు కొనుగోలు చేయవద్దు. అనుమతి లేకుండా చేసిన లేఔట్లు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతోపాటు, ఆయా లేఔట్లను కూల్చివేసే అధికారం గ్రామపంచాయతీలకు ఉంది. మండలంలో కేవలం రెండు లేఔట్లు మాత్రమే అనుమతిని పొందాయి. మిగిలిన వారు తప్పనిసరిగా అనుమతులు పొందాలి.

మరిన్ని వార్తలు