పోరులో రియల్టర్ల జోరు 

21 Jan, 2020 03:09 IST|Sakshi

మున్సిపోల్స్‌ బరిలో ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు

గెలుపునకు ఓటర్లపై కాసుల వర్షం

ఇప్పటికే రెండు, మూడు దశల్లో డబ్బు పంపిణీ.. మరోసారి ప్రలోభాలకు సిద్ధమవుతున్న వైనం  

అది ఆదిబట్ల మున్సిపాలిటీ. టీసీఎస్, కలెక్టరేట్, ఏరోస్పేస్‌ జోన్‌ రావడంతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. పురపాలికగా మారిన అనంతరం తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో మూడో వంతు అభ్యర్థులు రియల్టర్లే బరిలో నిలిచారు. 15 వార్డులకుగాను 49 మంది బరిలో ఉండగా.. ఇందులో 40 మంది స్థిరాస్తి వ్యాపారులే కావడం గమనార్హం. చైర్మన్‌ పదవి ఆశిస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఒకే వార్డు నుంచి పోటీ పడుతుండటంతో ఇక్కడ ఓటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఇద్దరు కూడా రియల్టీ వ్యాపారంతో కోట్లకు పడగలెత్తిన వారే కావడంతో మంచినీళ్ల ప్రాయంలా డబ్బులు కుమ్మరిస్తున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌ : పుర‘పోరు’కు ‘స్థిరాస్తి’ రంగం పెట్టుబడిగా మారింది. అసాధారణంగా పెరిగిన భూముల ధరలు.. కలిసొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో నడిచొచ్చిన నడమంత్రపు సిరి మున్సి‘పోల్స్‌’ను రసవత్తరంగా మార్చేశాయి. నగర/పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో రియల్టర్లే ఎక్కువగా ఉన్నారు. మరీ ముఖ్యంగా రాజధాని శివారు జిల్లాల్లోని సుమారు 40 పట్టణ సంస్థల్లో ఈ అభ్యర్థుల హవానే కనిపిస్తోంది. సాఫీగా సాగుతున్న వ్యాపారానికి కౌన్సిలర్‌/కార్పొరేటర్‌ పదవి కవచంలా ఉంటుందని భావిస్తున్న రియల్టర్లు.. పట్టణ పోరులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రజాప్రతినిధిగా అవతరించడం ద్వారా పనులను చక్కబెట్టుకోవచ్చని ఆశిస్తున్నారు. రిజర్వేషన్ల కారణంగా మొదట్నుంచీ కన్నేసిన వార్డుకు ఎసరొచ్చినా.. వేరే సీటు నుంచి పోటీ చేసేందుకు వెనుకాడకపోవడానికి డబ్బే కారణంగా కనిపిస్తోంది. రిజర్వేషన్‌ మహిళలకు కేటాయిస్తే.. తమ కుటుంబ సభ్యులను బరిలో దించింది కూడా రియల్టర్లే కావడం గమనార్హం. 

ఎంతకైనా రెడీ! 
రాజకీయ పార్టీలు కూడా రియల్‌ ఎస్టేట్‌ లో బాగా రాణించిన వారిని గుర్తించి బీ–ఫారాలు పంపిణీ చేశాయి. దీంతో హైదరాబాద్‌ శివార్లలోని మణికొండ, నార్సింగి, బండ్లగూడ, తుక్కుగూడ, తుర్కయంజాల్, ఆదిబట్ల, పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడ్చల్, ఘట్‌కేసర్, పెద్ద అంబర్‌పేట్, నిజాంపేట్, అమీన్‌పూర్, దుండిగల్, శంషాబాద్, సంగారెడ్డి మున్సిపాలిటీలే కాకుండా గ్రేటర్‌కు దూరంగా ఉన్న చౌటుప్పల్, షాద్‌నగర్, శంకర్‌పల్లి, వికారాబాద్, చండూరు, చిట్యాల, భువనగిరి తదితర పురపాలిక సంఘాల్లో పోటీపడుతున్న అభ్యర్థు ల్లోనూ సింహభాగం రియల్టర్లే ఉన్నారు. బహుళజాతి సంస్థల తాకిడి, ఐటీ కంపెనీల రాకతో హైదరాబాద్‌ వేగంగా విస్తరిస్తోంది. నాలుగేళ్ల క్రితం వరకు రియల్టీ రంగం కేవలం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకే పరిమితమవగా 2016లో సీఎం కేసీఆర్‌ జిల్లాల పునర్విభజన చేపట్టడం.. కొత్త జిల్లా కేంద్రాలు రావడంతో ఆ ప్రాంతాల్లోనూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

దీంతో గద్వాల, వనపర్తి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, పెద్దపల్లి, జనగామ తదితర పట్టణాల్లోనూ భూముల విలువలు పెరిగాయి. దీంతో స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఇలా సంపాదించిన సొమ్మును రాజకీయాల్లోకి మళ్లించేందుకు పురపోరు వేదికగా మారింది. సోమవారంతో ప్రచారపర్వానికి తెరపడగా.. ఇప్పటికే రెండు, మూడు దశల్లో పంపకాల ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులు.. తుది విడత పంపిణీకి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దేశవ్యాప్తంగా దిగ్విజయమైన 'దియా జాలో'

‘హాష్‌ట్యాగ్‌లు’ సృష్టించి వైరల్‌

పాల్వంచలో కంపించిన భూమి!

కరోనా భయంతో ఊరు వదిలివెళ్లిన ప్రజలు!

నిజామాబాద్‌, బాన్సువాడ హాట్‌స్పాట్‌ దిశగా!?

సినిమా

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!