ఖాకీ జాగా.. రియల్టర్ పాగా!

2 Jun, 2016 15:44 IST|Sakshi

     విశ్రాంత పోలీసు అధికారి స్థలంపై కబ్జాకోరుల కన్ను
     స్థలాన్ని చదును చేసిన వైనం
     మరో 20 మంది ప్లాట్ల స్వాహాకు యత్నం


భీమారం : వరంగల్ మహానగరం పరిధిలో పలువురు రియల్టర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు పాగా వేయడమే లక్ష్యంగా వారు పావులు కదుపుతున్నారు. దీంతో బాధితులు గుండెలు బాదుకొని లబోదిబోమనాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నగరానికి చెందిన ఓ రియల్టర్ ఇటీవల గోపాలపురంలోని సర్వే నంబర్ 110లోని ఓ విశ్రాంత పోలీసు అధికారికి చెందిన భూమిని కబ్జా చేశాడు. ఎవరి అనుమతి తీసుకోకుండా ఎంచక్కా చదును కూడా చేసేశాడు. పోలీసు విభాగంలో పనిచేసిన వారి స్థలాలకే భద్రత కొరవడిన ప్రస్తుత పరిస్థితుల్లో, సామాన్యుల ఆస్తుల రక్షణ ప్రశ్నార్ధకంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గోపాలపురంలోని సర్వే నంబర్ 110లో కబ్జాకు గురైన స్థలం వరంగల్ నగరానికి చెందిన ఎం.భిక్షపతిది. ఆయన హైదరాబాద్‌లో సీఐ హోదాలో విధులు నిర్వర్తించి, ఇటీవల పదవీ విరమణ పొందారు.

24 ఏళ్ల క్రితం మరో 24 మందితో కలిసి గోపాలపురంలోని ఓ వెంచర్‌లో భిక్షపతి ప్లాట్లు కొన్నారు. భూమి కొన్నవాళ్లు చాలామంది ఇప్పటికే ఇళ్లు కట్టుకోగా, కొంత స్థలం ఖాళీగా ఉంది. ఆ ఖాళీ స్థలాన్నే రియల్టర్ చాపలా చుట్టేసి స్వాహా చేసే ప్రయత్నం చేశాడని భిక్షపతి ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అరుునా రియల్టర్‌పై ఎలాంటి చర్యా తీసుకోకపోవడంతో.. నగర పోలీస్ కమిషనర్(సీపీ) సుధీర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు. గోపాలపురంలోని తమ వెంచర్‌కు చెందిన 1.30 ఎకరాల భూమి కబ్జాలో ఉందని భిక్షపతి సహా బాధితులంతా సీపీకి తమ గోడు వెల్లబోసుకున్నారు. పైసా..పైసా కూడగట్టి భూమి కొంటే రియల్టర్ ఆ భూమిని గద్దలా తన్నుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీపీ స్పందించి.. భూకబ్జాకు యత్నిస్తున్న రియల్టర్‌పై రౌడీషీట్ తెరవాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. ఆ రియల్టర్ కబ్జా చేయదల్చుకున్న స్థలానికి వస్తే , వెంటనే అరెస్ట్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు