మోగిన రె‘బెల్స్‌’

12 Nov, 2018 10:42 IST|Sakshi
సురేందర్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న నాయకుడు

 సీట్ల పంపకాలు పూర్తి కాకముందే హెచ్చరికలు 

 పాలమూరులో టీపీసీసీ కార్యదర్శి సురేందర్‌రెడ్డి అనుచరుల భేటీ 

 మహబూబ్‌నగర్‌ సీటు కాంగ్రెస్‌కు దక్కకపోతే బరిలో నిలవాలని తీర్మానం 

 కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయమన్న ‘మారేపల్లి’ 

 ఉమ్మడి జిల్లాలోని మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  రానున్న శానసనభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల అంశం తేలకముందే కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. మహాకూటమి సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక పూర్తికాముందే రెబెల్స్‌ తమ వాణి వినిపిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఎట్టి పరిస్థితిలో గద్దె దింపాలనే యోచనతో కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి పురుడుపోసుకుంది. కూటమి మిత్రపక్షాలకు ఎన్నికల్లో అవకాశం కల్పించాలనే యోచనతో కొన్ని స్థానాలు కేటాయించాలని భావించింది. అందుకు అనుగుణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు స్థానాలను మిత్రపక్షమైన టీడీపీకి కేటాయించేందుకు అంగీకరించినట్లు సమాచారం.

మహబూబ్‌నగర్, మక్తల్‌ స్థానాలను టీడీపీకి కేటాయించినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు మాత్రం మిత్రపక్షాలకు స్థానాలు కేటాయించొద్దంటూ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్‌కే కేటాయించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. తాజాగా టీపీసీసీ కార్యదర్శి మారేపల్లి సురేందర్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. పాత జిల్లా కేంద్రంగా ఉన్న మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సీటును ఎట్టి పరిస్థితుల్లో పొత్తులో భాగంగా వదులుకోవద్దని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అధిష్టానం నిర్ణయం విరుద్ధంగా ఉంటే.. సురేందర్‌రెడ్డి బరిలో ఉండాలంటూ కార్యకర్తలు తీర్మానించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


చాలాచోట్ల ఇదే పరిస్థితి 
ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి సానుకూల పవనాలు ఉన్నాయని సర్వేల్లో తేలిందని పార్టీ అధిష్టానం చెబుతుండగా.. ఎన్నికల బరిలో నిలిచేందుకు పలువురు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కరికి మించి ఆశావహు లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహా కూటమి నుంచి ఉమ్మడి జిల్లాలో రెండు స్థానా లను మిత్రపక్షాలకు కేటాయించాలని భావించారు. ఈ మేరకు జిల్లాలోని మహబూబ్‌నగర్, మక్తల్‌ స్థానాలను టీడీపీకి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది. 

   పార్టీ టికెట్‌ దక్కకపోతే రెబల్‌గానైనా బరిలోకి దిగాలని పలువురు భావిస్తున్నారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి టీపీసీసీ కార్యదర్శి ఎం.సురేందర్‌రెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. అలాగే మక్తల్‌లో కూడా సీటును టీడీపీకి కేటాయిస్తే..    అక్కడి నుంచి జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి బరిలో నిలవాలని భావిస్తున్నారు. అదే విధంగా జడ్చర్ల, దేవరకద్ర తదితర నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెబెల్స్‌ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.  


కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకే... 
గెలిచే సత్తా ఉన్న వారికే కాంగ్రెస్‌ టికెట్‌ దక్కుతుందని ఆశిస్తున్నాం.. ఈ విషయమై ఆదివారం సాయంత్రం వరకు వేచి చూశాక పార్టీ నిర్ణయం అందుకు విరుద్ధంగా ఉంటే కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకు నడుచుకుంటానని టీపీసీసీ కార్యదర్శి మారేపల్లి సురేందర్‌రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఆదివారం పార్టీ ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ కార్యకర్తల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకురావడానికి ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

   నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌ను వెంటనే ప్రకటించాలని కోరుతూ కళ్లలో నీళ్లు పెట్టుకొని ఢిల్లీలో నేతల చుట్టూ తిరిగానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి, అంతర్గత సర్వేల్లో ముందున్న వారికే కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించాలని స్క్రీనింగ్‌ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు టికెట్‌ ప్రక టించకపోవడంతో కార్యకర్తల్లో నైర్యాశం నెలకొందన్నారు. టికెట్ల కేటాయింపుల్లో ఎవరి స్వార్థాన్ని వారు చూసుకుంటున్నారని సురేందర్‌రెడ్డి ఆరోపించారు. అధిష్టానం పెద్దలు.. కార్యకర్తల మనోభావాలను గమనించి పొత్తుగా కాకుండా గెలిచే అభ్యర్థికి టికెట్‌ ఇవ్వాలని విన్నవించారు. కార్యకర్తలు, అభిమానులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని అన్నారు. అలాగే నియోజకవర్గంలో కొనసాగుతున్న అరాచాక పాలనను అంతమోందిస్తామని పేర్కొన్నారు 

మరిన్ని వార్తలు