తిరుగుబాటు బావుటా

20 Nov, 2018 16:18 IST|Sakshi

అర్బన్‌లో రె‘బెల్‌’ 

శివసేన టికెట్‌పై ధన్‌పాల్‌ నామినేషన్‌ 

కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన రత్నాకర్‌ సైతం..  

రసవత్తరంగా జిల్లా కేంద్ర రాజకీయం 

సాక్షి, నిజామాబాద్‌: జిల్లా కేంద్రంలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఈ రెండు పార్టీల టికెట్‌ ఆశించిన నాయకులు నామినేషన్లు వేయడం ఆసక్తికరంగా మారింది.

 కాంగ్రెస్‌లోనూ..

 కాంగ్రెస్‌ టికెట్‌ కోసం డీసీసీ అధ్యక్షులు తాహెర్‌బిన్‌ హందాన్‌తో పాటు, మహేష్‌కుమార్‌గౌడ్, రత్నాకర్‌లు ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంలో సామాజిక సమీకరణలు, పార్టీకి అందించిన సేవలు, సర్వే నివేదికల ఆధారంగా అధిష్టానం అర్బన్‌ టికెట్‌ను డీసీసీ అధ్యక్షులు తాహెర్‌ బిన్‌ హందాన్‌కు ఖరారు చేసింది. దీంతో ఈ టికెట్‌ ఆశించిన రత్నాకర్‌ కూడా సోమవారం నామినేషన్‌ వేయడం జిల్లా కేంద్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాను అర్బన్‌ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేస్తానని ఆదివారం మీడియాకు రత్నాకర్‌ సమాచారం అందించారు.

నామినేషన్‌ దాఖలు చేసేందుకు చివరి సమయంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రత్నాకర్‌ నామినేషన్‌ వేసేందుకు కార్యాలయంలోకి వెళ్లారు. పార్టీ అధిష్టానంతో పాటు, జిల్లా కాంగ్రెస్‌ శ్రేణుల్లో తాహెర్‌కు అందరివాడుగా పేరుంది. టికెట్‌ రేసులో ఉన్న మహేష్‌కుమార్‌గౌడ్‌ కూడా తాహెర్‌కు మద్దతు పలికారు. మహేష్‌ త్యాగం చేయడంతోనే తనకు అభ్యర్థిత్వం దక్కిందని తాహెర్‌ పేర్కొన్నారు. ఈ తరుణంలో రత్నాకర్‌ తిరుగుబాటు బావుటా ఎగురవేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

 బీజేపీకి షాక్‌.

 రెబల్స్‌ బెడద బీజేపీకి కూడా తప్పడం లేదు. నిజామాబాద్‌ అర్బన్‌ బీజేపీ టికెట్‌ ఆశించిన ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్త సోమవారం నామినేషన్‌ వేయడం ఆసక్తికరంగా మారింది. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ధన్‌పాల్‌ శివసేన టికెట్‌పై బరిలోకి దిగాలని నిర్ణయించారు. దీంతో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థి బెడద కొనసాగనుంది. అర్బన్‌ స్థానం బీజేపీ అభ్యర్థిత్వం మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణకు లభించింది. ఈ టికెట్‌ కోసం ధన్‌ పాల్‌ గట్టి ప్రయత్నాలు చేసి విఫలమయ్యా రు. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసిన ధన్‌పాల్‌ చివరకు పోటీ చేయాలని నిర్ణయించారు.

 నాయుడు ప్రకాశ్‌ సైతం నామినేషన్‌

 జుక్కల్‌ బీజేపీ టికెట్‌ విషయంలో తనకు అన్యాయం చేశారని నిరసిస్తూ ఆ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి నాయుడు ప్రకాష్‌ సైతం శనివారం నిజామాబాద్‌ అర్బన్‌ స్థానానికి నామినేషన్‌ వేసిన విషయం విదితమే. అయి తే నాయుడు ప్రకాష్‌కు బీజేపీ అధిష్టానం బా న్సువాడ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఆయన బాన్సువాడ స్థా నానికి కూడా నామినేషన్‌ వేశారు. అర్బన్‌ స్థానానికి ఆయన వేసిన నామినేషన్‌ను ఉప సంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నా యి. జిల్లాలో బీజేపీకి పట్టున్న స్థానాల్లో ఒకటైన నిజామాబాద్‌అర్బన్‌లో రెబల్‌ అభ్యర్థి బరిలోకి దిగడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇలా తిరుగుబాటు బావు టా ఎగురవేసిన అభ్యర్థులు పార్టీ బుజ్జగింపులకు తలొగ్గి నామినేషన్లను ఉపసంహరించుకుంటారా..? లేక బరిలో ఉంటారా..? అనే అంశం నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 22 తర్వాతే తేలనుంది. 

మరిన్ని వార్తలు