దారికొస్తున్నారు.. 

21 Nov, 2018 16:23 IST|Sakshi

కాంగ్రెస్, బీజేపీలో తిరుగుబాటు నేతలకు బుజ్జగింపులు

రంగంలోకి దిగిన జిల్లా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు

సర్దుకుపోతామంటున్న అసంతృప్తులు

సాక్షి, నిజామాబాద్‌: టికెట్‌ దక్కక తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలు దారికొస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో అసమ్మతి రాగం వినిపించిన నేతలు సర్దుకుపోయేందుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు బుజ్జగించడంతో పోటీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్‌ అర్బన్‌ స్థానం కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసిన రత్నాకర్‌కు భంగపాటు ఎదురైంది. దీంతో ఆయన సోమవారం చివరి నిమిషంలో నామినేషన్‌ వేశారు. తిరుగుబాటు అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్రం గా పరిగణిస్తోంది. జిల్లాలోని ఆ పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని రత్నాకర్‌కు షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌ సూచించడంతో ఆయన అందు కు అంగీకరించినట్లు సమాచారం.

ఎల్లారెడ్డి అభ్యర్థిత్వం కోసం సురేందర్‌తో పాటు, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. పార్టీలో రేవంత్‌రెడ్డి వర్గా నికి చెందిన సుభాష్‌రెడ్డి ఎల్లారెడ్డి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన విషయం విదితమే. దీంతో సుభా ష్‌రెడ్డితో నామినేషన్‌ను విత్‌డ్రా చేయించేందుకు రేవంత్‌రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.ఆయన కూడా పోటీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బాన్సువాడ స్థానానికి మల్యాద్రిరెడ్డి కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం గట్టి ప్రయత్నాలు చేసిన ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించిన మల్యాద్రి నామినేషన్‌ వేసి, బరిలో ఉంటానని ప్రకటించారు.

మల్యాద్రిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కూడా ప్రయత్నించింది. కానీ చివరకు నాయుడు ప్రకాష్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని మల్యాద్రిపై కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఒత్తిడి తెస్తున్నారు. మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డితో పాటు, రేవంత్‌రెడ్డిల ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు మల్యాద్రి అంగీకరించి నామినేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశాలున్నట్లు ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మరోవైపు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం టికెట్‌ ఆశించి భంగపడిన అర్కల నర్సారెడ్డి కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అలక బూనిన అర్కలను కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఆయన కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయి.

 ధన్‌పాల్‌తో బీజేపీ సంప్రదింపులు..

నిజామాబాద్‌ అర్బన్‌ స్థానానికి బీజేపీ టికెట్‌ ఆశించిన ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తకు నిరాశే ఎదురైన విషయం విదితమే. ఆయన బీజేపీకి రాజీనామా చేసి, శివసేన పార్టీ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించారు. ఈమేరకు సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్‌ వేశారు. ఇదే సమయంలో ధన్‌పాల్‌ రాజీనామాను తిరస్కరిస్తున్నామని హైదరాబాద్‌లో బీజేపీ ప్రకటించింది. దీంతో ఆయన కొంత మెత్తబడినట్లు తెలుస్తోంది. ఆయన మాత్రం బరిలోంచి తప్పుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 21 వరకు గడువుంది. బుధవారం ఈ తిరుగుబాటు నేతలంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు