బుజ్జగించారు..ఉపసంహరించుకున్నారు...

23 Nov, 2018 08:38 IST|Sakshi

అధిష్టానం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన డీకే.అరుణ 

మెట్టు దిగిన రెబల్స్‌ నేతలు.. నామినేషన్ల ఉపసంహరణ

మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి వెనక్కి.. 

దేవరకద్రలో నామినేషన్‌ ఉపసంహరించుకున్న జీఎంఆర్‌ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. గెలుపే లక్ష్యంగా నేతలందరూ ఒక తాటి మీదకు వస్తున్నారు. ముఖ్యంగా టికెట్లు దక్కక అసంతృప్తితో నామినేషన్లు వేసిన నేతల్లో కొందరిని బుజ్జగించే పని మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్లు దక్కక మూడు చోట్ల రెబల్స్‌ నామినేషన్లు వేశారు.

టీఆర్‌ఎస్‌ తరఫున ఒక స్థానంలో రెబెల్‌ బరిలోకి దిగారు. ఆయా నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే.అరుణను రంగంలోకి దింపింది. దీంతో ఆమె మహబూబ్‌నగర్‌లో కూటమి పొత్తుకు విఘాతం కలగకుండా రెబెల్స్‌ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి.

అలాగే దేవరకద్ర విషయంలో జైపాల్‌రెడ్డి జోక్యంతో పార్టీ నేత జి.మధుసూదన్‌రెడ్డి(జీఎంఆర్‌) తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఇక నారాయణపేటలో రెబెల్‌గా బరిలోకి దిగిన కుంభం శివకుమార్‌రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడంలేదు. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా కొనసాగేందుకు ఆయన నిర్ణయించుకోగా.. మక్తల్‌లోనూ టీఆర్‌ఎస్‌ రెబెల్‌ నేత ఎం.జలందర్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. 


నచ్చజెప్పిన డీకే.అరుణ 
మహాకూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించిన మహబూబ్‌నగర్‌ స్థానం విషయంలో నెలకొన్న చిక్కులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం మాజీ మంత్రి డీకే. అరుణకు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రంగప్రవేశం చేసిన అరుణ... కూటమిలో భాగస్వామ్యమైన తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి నేతలతో సంప్రదింపులు చేశారు.

తెలంగాణ ఇంటి పార్టీ తరఫున బరిలో నిలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డిని మహబూబ్‌నగర్‌లోని తన నివాసం వద్దకు పిలిపించుకుని సర్దిచెప్పారు. భవిష్యత్‌లో కూటమి భాగస్వామ పక్షాలకు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ జన సమితి నేత జి.రాజేందర్‌రెడ్డికి సైతం నచ్చజెప్పారు. ఇలా సంప్రదింపులు చేసి ఇరువురు నేతలతతో నామినేషన్లు ఉపసంహరింప చేశారు. అలాగే కూటమి భాగస్వామ అభ్యర్థి ఎర్ర శేఖర్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని సూచించారు.

అందుకు ఇరువురు నేతలు కూడా సమ్మతి తెలిపి... ప్రచారంలో పాల్గొంటామని ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌ టికెట్‌ దక్కక బయటకు వెళ్లి ఎన్‌సీపీ తరఫున బరిలో ఉన్న ఎం.సురేందర్‌రెడ్డి, బీఎస్పీ తరఫున బరిలో ఉన్న సయ్యద్‌ ఇబ్రహీం మాత్రం తమ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. అలాగే దేవరకద్రలో సైతం జైపాల్‌రెడ్డి వర్గంగా ముద్రపడిన జీఎంఆర్‌ సైతం బుజ్జగింపుల పర్వంలో భాగంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్న డోకూరు పవన్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో సైతం పాల్గొంటామని ప్రకటించారు. 


నారాయణపేటలో సీన్‌ రివర్స్‌ 
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు మూడు చోట్ల రెబెల్స్‌ బెడద ఉండగా రెండు చోట్ల కాస్త సద్గుమణిగింది. కానీ నారాయణపేటలో మాత్రం టికెట్‌ దక్కక స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శివకుమార్‌రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. అసంతృప్తులను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ ముఖ్యులు డీకే.అరుణను రంగంలోకి దించగా.. ఆమె కూడా నారాయణపేట విషయాన్ని పట్టించుకోలేదు.

‘పేట’లో గెలిచే అవకాశం ఉన్న శివకుమార్‌రెడ్డికి టికెట్‌ కేటాయించకపోవడం దారుణమని... అందువల్ల పోటీ నుంచి వైదొలగాలని ఆయనకు తాను చెప్పబోనని స్పష్టం చేసినట్లు సమాచారం. అన్ని సర్వేల్లో మెరుగైన నివేదికలు ఉన్న శివకుమార్‌ను అవసరమైతే గెలిపించుకుంటానని అరుణ చెప్పినట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు