రిజర్వ్‌ ఫారెస్ట్‌ దత్తత తీసుకుంటా..

12 Jun, 2020 04:26 IST|Sakshi
‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో భాగంగా గురువారం తన నివాసంలో మొక్కనాటుతున్న హీరో ప్రభాస్‌. చిత్రంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌

వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా అడవిని అభివృద్ధి చేస్తా: ప్రభాస్‌

‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ మూడో దశను ప్రారంభించిన బాహుబలి

రామ్‌చరణ్, రానా, శ్రద్ధాకపూర్‌లను చాలెంజ్‌కు నామినేట్‌...  

సాక్షి, హైదరాబాద్‌: రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడో దశ ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’కు శ్రీకారం చుట్టారు. దీంతో ‘పుడమి పచ్చగుండాలే–మన బతుకులు చల్లగుండాలే’అనే నినాదంతో ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన ఈ చాలెంజ్‌ మూడో దశ మొదలైంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ.. ‘సంతోష్‌ కుమార్‌ మొదలుపెట్టిన గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమం ఉన్నత విలువలతో కూడుకున్నది. ఇందులో భాగంగా వారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం ఎంతో స్ఫూర్తినిచ్చింది. సంతోష్‌ ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్‌ ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్‌ అభివృద్ధికి పాటుపడతాను.

ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’అని చెప్పారు. ఇక మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ను ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’కు నామినేట్‌ చేస్తున్నట్లు ప్రభాస్‌ తెలిపారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ప్రభాస్‌ది మంచి మనసు. ఆయన సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు. ‘గ్రీన్‌ చాలెంజ్‌’ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్‌ ఫారెస్ట్‌ అభివృద్ధికి పూనుకోవడం స్ఫూర్తిదాయకం. ప్రభాస్‌ చేతులమీదుగా ఈ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మూడో దశ కార్యక్రమం జరగడం సంతోషం. కోట్లాదిగా ఉన్న వారి అభిమానులంతా ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి నేలతల్లికి పచ్చని పందిరి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’అని అన్నారు. కార్యక్రమంలో ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’సమన్వయకర్త సంజీవ్‌ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు