రె‘బెల్స్‌’ ఆగేనా

18 Nov, 2018 12:21 IST|Sakshi
గడ్డం వినోద్‌కుమార్‌, నారాయణరావు పటేల్‌, బోడ జనార్ధన్‌, అరవింద్‌రెడ్డి

దివాకర్‌రావుకు అరవింద్‌రెడ్డి మద్దతు

ముథోల్‌లో రామారావు పటేల్‌కు సోదరుడి షాక్‌

బెల్లంపల్లి బరిలో గడ్డం వినోద్‌

చెన్నూరులో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బోడ

బోథ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ‘సోయం’.. జాదవ్‌ అనిల్‌ నిరసన

రాజకీయం రసవత్తరం

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: నామినేషన్ల ఘట్టంలోనే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాజకీయ పార్టీల్లోని అంతర్గత కుమ్ములాటలు ఎన్నికల సమయంలో బట్టబయలు అవుతున్నాయి. ఉపసంహరణల పర్వం పూర్తయి, బరిలో నిలిచిన అభ్యర్థులు హోరా హోరీ ప్రచారానికి దిగేనాటికి పరిస్థితుల్లో ఇంకా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌లో టికెట్ల కేటాయింపు అనంతరం చోటుచేసుకున్న అసంతృప్తి వివిధ రూపాల్లో పెల్లుబికి... పలు చోట్ల చల్లారినా, మాజీ మంత్రి గడ్డం వినోద్‌కుమార్‌ బెల్లంపల్లిలో పోటీకి దిగుతుండడం ఆసక్తికర పరిణామంగా మారింది. మహాకూటమి తరుపున సీపీఐ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో వినోద్‌ బరిలో నిలవడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయి.

ఇక కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా తయారవుతున్నాయి. ‘నేను ఓడినా సరే... ప్రత్యర్థి గెలవకూడదు’ అనే ధోరణిలో పలుచోట్ల కాంగ్రెస్‌ నేతలు రెబల్స్‌గా మారుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీ అభ్యర్థికి మేలు జరిగే పరిస్థితి కాంగ్రెస్‌ అసంతృప్త నేతలు కల్పిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
 
అరవింద్‌రెడ్డి రాకతో... 
శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెత మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్‌.దివాకర్‌రావు విషయంలో కచ్చితంగా సరిపోతుంది. కాంగ్రెస్‌లో అరవింద్‌రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి కె.ప్రేంసాగర్‌రావు. ఒకే పార్టీలో ఉన్నా, ఉప్పు నిప్పుగా మెలిగిన ఈ నాయకులు టికెట్టు కోసం ఎవరికి వారే ప్రయత్నించారు. అయితే చివరికి ప్రేంసాగర్‌రావుకు కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం ఖరారు కావడం, నామినేషన్‌ దాఖలు చేయడం కూడా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అరవింద్‌రెడ్డి గతంలో తాను వదిలేసిన టీఆర్‌ఎస్‌ను ఆశ్రయించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివాకర్‌రావు పోటీ చేస్తుండగా, శనివారం నామినేషన్‌ సందర్భంగా అరవింద్‌రెడ్డి రిటర్నింగ్‌ ఆఫీస్‌కు దివాకర్‌రావుతో కలిసివెళ్లారు. టికెట్టు వస్తే ప్రత్యర్థిగా తలబడాల్సిన నేతకు మద్ధతుగా వెళ్లడం రాజకీయ పరిణామాల తీరును తెలియజేస్తుంది. అరవింద్‌రెడ్డి రాకతో టీఆర్‌ఎస్‌కు మేలు జరుగుతుందని దివాకర్‌రావు వర్గీయులు చెపుతున్నారు. అరవింద్‌రెడ్డి సైతం తన లక్ష్యం ప్రేంసాగర్‌రావు ఓటమే అని బాహాటంగా చెపుతున్నారు. 

వినోద్‌ పోటీతో ఆసక్తిగా బెల్లంపల్లి
టీఆర్‌ఎస్‌ నుంచి చెన్నూరు టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి గడ్డం వినోద్‌ బెల్లంపల్లి సీటైనా ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. హైకమాండ్‌ ససేమిరా అనడంతో కాంగ్రెస్‌ నుంచి టికెట్టు తెచ్చుకునేందుకు ఢిల్లీ వరకు వెళ్లారు. అక్కడ కూడా రిక్తహస్తమే ఎదురవడంతో టీజేఎస్‌ నుంచి పోటీ చేయాలని భావించినా, ఆ పార్టీకి ఉన్న పరిమితుల వల్ల అసాధ్యంగానే మిగిలింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వినోద్‌ ఇండిపెండెంట్‌గానైనా బెల్లంపల్లి నుంచి పోటీ చేయడమే అని తీర్మానించుకొని రంగంలోకి దిగారు.

బీఎస్పీ నుంచి టికెట్టు హామీ లభించింది. బెల్లంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మునిమంద స్వరూప భర్త రమేష్‌తో పాటు పట్టణానికి చెందిన కౌన్సిలర్లు వినోద్‌ను పోటీలో నిలుపుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుక్రవారం వినోద్‌ ఇంటికి వెళ్లి ఇండిపెండెంట్‌గా పోటీ చేయవద్దని విజ్ఞప్తి చేసినా వినోద్‌ వెనక్కు తగ్గలేదు. బీఎస్పీ అభ్యర్థిగా వినోద్‌ 19న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. చిన్నయ్యకు ప్రధాన ప్రత్యర్థిగా ఇప్పటివరకు సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌ ఉండగా, తాజా పరిణామాలతో వినోద్‌ కూడా మరో ప్రత్యర్థిగా మారబోతున్నారు. ఈ పరిణామాలతో బెల్లంపల్లి ఎన్నికలు వేడెక్కాయి.
 

రామారావుకు మొదలైన సొంత ‘పోరు’
ముథోల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రామారావు పటేల్‌కు వరుసకు సోదరుడైన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ రెబల్‌గా మారుతున్నారు. నారాయణరావు పటేల్‌ మహారాష్ట్రకు చెందిన శరద్‌పవార్‌ పార్టీ ఎన్‌సీపీ తరుపున పోటీ చేయనున్నారు. సరిహద్ధుగా ఉన్న మహారాష్ట్ర ప్రభావం ఎక్కువగా ఉండే ముథోల్‌లో అక్కడి నుంచి వచ్చి సెటిలయిన వారు ఎక్కువే. నారాయణరావు, రామారావు సైతం మహారాష్ట్రీయులే. ఈ నేపథ్యంలో రామారావు పటేల్‌ను ఎన్‌సీపీ తరుపున పోటీ చేస్తున్న నారాయణరావు ఏమేరకు ఎదుర్కోగలడనేదే సమస్య. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రధాన పోటీదారుడిగా ఉంటారా? ఓట్లను చీల్చి విజయాన్ని ప్రభావితం చేసే ఓట్లు రాబట్టుకుంటారా? అనేది వేచి చూడాలి. 

చెన్నూరులో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బోడ
నాలుగుసార్లు వరుస ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన బోడ జనార్ధన్‌ తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2004 నుంచి రాజకీయంగా కకావికలం అయ్యారు. కాంగ్రెస్‌ టికెట్టుతో పోటీ చేయాలని భావించి భంగపడ్డ ఆయన కాంగ్రెస్‌ రెబల్స్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. చెన్నూరులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు బాల్క సుమన్, వెంకటేష్‌ నేత మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న పరిస్థితుల్లో బోడ జనార్ధన్‌ పాత్ర ఎలా ఉండబోతుందన్నదే ప్రశ్న.బోథ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సోయం బాబూ రావు ఖరారు కావడంతో టికెట్టు ఆశించి భంగపడ్డ అనిల్‌ జాదవ్‌ ఆదివారం కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు