రెబెల్స్‌ రెడీ!

14 Nov, 2018 14:30 IST|Sakshi

 కూటమిలో రగులుతున్న ఆగ్రహ జ్వాలలు 

కొత్తగూడెంలో కోనేరు చిన్ని ఆధ్వర్యంలో నామా దిష్టిబొమ్మ దహనం

పాల్వంచలో ఎడవల్లి వర్గీయులచే ఉత్తమ్‌ దిష్టిబొమ్మ.. 

స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న కృష్ణ ?

అశ్వారావుపేట సీటు టీడీపీకి ఇవ్వడంతో  కాంగ్రెస్‌ శ్రేణుల అసంతృప్తి  

సాక్షి, కొత్తగూడెం:  రెండు నెలలుగా సాగదీస్తూ.. చివరకు నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్‌ కూటమి పార్టీల నాయకులు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అయితే ఇంతకాలం టికెట్లు ఆశించి భంగపడిన వారి అనుచరులు, అసమ్మతి నేతలు ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. మరోవైపు కూటమి పొత్తుల్లో భాగంగా సీట్లు ఆశించి, నిరాశకు లోనైన భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం ఆగ్రహావేశాలతో ఉన్నారు.

 జిల్లాలోని ఏకైక జనరల్‌ స్థానం కొత్తగూడెం స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పేరు ప్రకటించినప్పటికీ.. ఒక రకమైన గందరగోళం మాత్రం కొనసాగుతూనే ఉంది. పొత్తుల్లో భాగంగా ఈ సీటును సీపీఐ గట్టిగా కోరింది. ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలనుకున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో సీపీఐ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థికి సహకరించేదీ, లేనిదీ ఇప్పటికీ సీపీఐ కచ్చితంగా చెప్పడం లేదు. ఇక కాంగ్రెస్‌ టికెట్‌ కోసం చివరివరకు తీవ్రంగా ప్రయత్నించిన టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణకు సీటు దక్కకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 పాల్వంచలో ఎడవల్లి వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వనమా వెంకటేశ్వరరావుకు సహకరించేది లేదని వారు చెబుతున్నారు. నేడు (బుధవారం) తన వర్గీయులతో ఎడవల్లి సమావేశం ఏర్పాటు నిర్వహించనున్నారు. వారితో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తానని ఎడవల్లి ‘సాక్షి’కి తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) ఆశించారు. చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ద్వారా గట్టి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ భంగపాటు తప్పలేదు. దీంతో చిన్ని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

 ఆయన వర్గీయులు కొత్తగూడెంలోని గణేష్‌ టెంపుల్‌ ఏరియాలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. నామా తన ఒక్కడి స్వార్థం చూసుకుని తనకు అన్యాయం చేశారంటూ కోనేరు చిన్ని నేరుగానే విమర్శిస్తున్నారు. కోనేరు సైతం ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అశ్వారావుపేట సీటును టీడీపీకి కేటాయించడంతో అక్కడి నుంచి మెచ్చా నాగేశ్వరరావును ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టీడీపీకి సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. అంతేకాదు.. మెచ్చాను ఓడిస్తామని అంటున్నారు.టీడీపీ కేడర్‌ మొత్తం ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉందని, ఈ నేపథ్యంలో టీడీపీకి టికెట్‌ ఇవ్వడమేంటని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థికి గడ్డు పరిస్థితి తప్పేలా లేదు.

ఇల్లెందు మిగిలింది..  

ఇల్లెందు నియోజకవర్గం నుంచి 31 మంది ఆశావహులు టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఇక్కడ అభ్యర్థి ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. ఈ టికెట్‌ కేటాయింపు విషయంలో అధిష్టానం తీవ్ర కసరత్తు చేయాల్సి వస్తోంది. ఇక్కడ ముందే అభ్యర్థిని ప్రకటిస్తే రెబెల్స్‌ భారీగా నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి ఉండడంతో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ∙భద్రాచలం నియోజకవర్గం నుంచి నలుగురూ కొత్తవారే టికెట్‌ ఆశించారు. అయితే అనూహ్యంగా ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. వీరయ్య స్థానికేతరుడు కావడంతో ఫలితం ఎలా ఉంటుందో అని శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.  

మరిన్ని వార్తలు