మంత్రి జగదీశ్‌రెడ్డిపై రెక్కీ?

19 Sep, 2018 02:50 IST|Sakshi

     ఈ నెల 2న డ్రోన్‌తో నాగారం పరిసరాలు చిత్రీకరణ 

     మంత్రి ఇంటిని కూడా చిత్రీకరించినట్లు ప్రచారం

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: విద్యుత్‌ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగారంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా డ్రోన్‌ కెమెరాలతో గ్రామం మొత్తాన్ని చిత్రీకరించారని, ఇందులో మంత్రి ఇంటి పరిసరాలను కూడా తీశారని సమాచారం. ఈనెల 2న పోలీసు బలగాలు ప్రగతి నివేదన సభకు వెళ్లడంతో నిఘా లేదని భావించిన సదరు వ్యక్తులు దూర ప్రాంతంనుంచి గ్రామానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి ఇటీవల తన స్వగ్రామంలో పాత ఇంటి పక్కనే కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. నెల రోజుల క్రితం కూడా ఆయన నాగారం వెళ్లారు. స్వగ్రామం కావడంతో ఆయన వచ్చినప్పుడల్లా గ్రామంలో తనతో సన్నిహితంగా ఉన్న కుటుంబాల వద్దకు వెళ్లి పలకరిస్తారు. మంత్రి ఇంటి పరిసరాల్లో ఎప్పుడూ పోలీసు బందోబస్తు ఉంటుంది.   

గ్రామమంతా చిత్రీకరణ.. 
ఇన్నోవా వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్‌ కెమెరాతో నాగారం బంగ్లా నుంచి నాగారం స్కూలు వరకు అలాగే తుంగతుర్తి రోడ్డు, హెల్త్‌ సెంటర్‌ మీదుగా ఫణిగిరికి వెళ్లే రోడ్డు, గ్రామంలోని అన్ని వీధులు, గ్రామం నుంచి బయటకు వెళ్లే డొంక రోడ్లను చిత్రీకరించారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మంత్రిపై దాడి చేస్తే, గ్రామం నుంచి పొలాల మీదుగా తప్పించుకునేందుకు డ్రోన్‌తో నాగారం పరిసరాలను చిత్రీకరించారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు నిఘా విభాగాలు కూడా వారం రోజులుగా ఈ విషయమై గ్రామస్తులు ద్వారా  వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.  

మా దృష్టికి వచ్చింది: వెంకటేశ్వర్లు, ఎస్పీ 
‘నాగారంలో డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించిన విషయం మా దృష్టికి కూడా వచ్చింది. రోడ్లు, ఇళ్లు,  మంత్రి ఇంటిని కూడా చిత్రీకరించారని తెలిసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. రెండు, మూడు రోజుల్లో దీన్ని ఎవరు తీశారో తేలుస్తాం’.  

మరిన్ని వార్తలు