ఆశల పల్లకి..

23 May, 2014 02:08 IST|Sakshi
ఆశల పల్లకి..
  •      పార్టీ అధిష్టానానికి విధేయుల సిఫార్సులు
  •      ఎమ్మెల్సీ పదవిపై ముఖ్య నాయకుల ఆశలు
  •      మార్కెట్ కమిటీలపై ద్వితీయ శ్రేణి నేతల ధీమా
  •      కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, ఆలయ కమిటీలు, గ్రంథాలయచైర్మన్ సీట్లపైనా నజర్
  •  సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడే రోజు దగ్గరపడుతోంది. 13 ఏళ్ల ఉద్యమం తర్వాత సంపూర్ణ మెజారిటీతో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. సాధారణ ఎన్నికల్లో పూర్తి స్థాయి విజయం సాధించడంతో అన్ని స్థాయిల్లోని టీఆర్‌ఎస్ నేతల్లో నామినేటెడ్ పదవులపై ఆశలు పెరుగుతున్నాయి.

    రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ కోసం ఇన్నాళ్లు పని చేసిన వారు, ఎన్నికల్లో అవకాశాలు రాకపోయినా పార్టీ విజయం కోసం పని చేసిన విధేయులు... తమ అర్హతను, ఆశించే పదవుల వివరాలను టీఆర్‌ఎస్ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. నామినేటెడ్, ఇతర ప్రభుత్వ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలని స్వయంగా కోరడంతోపాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతల సిఫారసులను జత చేస్తున్నారు.

    టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని వీరు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, మార్కెట్ కమిటీలు, పట్టణ అభివృద్ధి మండలి, దేవాలయ కమిటీ, విశ్వవిద్యాలయ పాలకమండలి, న్యాయ శాఖలోని పలు పోస్టులపై టీఆర్‌ఎస్ నాయకులతోపాటు గులాబీ దళానికి పరోక్షంగా సహకరించిన వారు ఆశలు పెట్టుకున్నారు.
     
    ముఖ్య నేతలు... ఎమ్మెల్సీ

    టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేసిన కీలక నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. ఒకే నియోజకవర్గంలో ఎక్కువ మంది నియోజకవర్గ స్థాయి నాయకులు ఉండడంతో ఒకరికే అవకాశం వచ్చింది. మిగిలిన వారికి ఇతర అవకాశాలు వస్తాయని టికెట్ల ఖరారు సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి కీలకంగా పని చేసిన నాగుర్ల వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కలేదు.

    పరకాల, భూపాలపల్లి టికెట్ ఆశించిన ఈయనకు ఎక్కడా అవకాశం రాలేదు. టికెట్ల కేటాయింపులో టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం ప్రకారం ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారు. భూపాలపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయంలో కీలకపాత్ర వహించారు. ఇక్కడ గెలిచిన మధుసూదరచారి ఇప్పుడు మంత్రి పదవి రేసులో ఉన్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో నాగుర్ల వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశముందని టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు.

    పరకాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన న్యాయవాదుల కోటాలో ముద్దసాని సహోదర్‌రెడ్డికి ఈ స్థానంలో టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మొలుగూరి బిక్షపతికి టిక్కెట్ ఇవ్వకపోవడంతో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.

    అయితే సిట్టింగ్ స్థానం పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోవడంతో మొలుగూరికి ఎమ్మెల్సీ పదవిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఇప్పుడు ఖాళీగా ఉంది. దీనికి త్వరలో ఎన్నికలు రానున్నాయి. గతంలో కొండా మురళీధర్‌రావు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వ్యవహరించారు. తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎక్కువ సంఖ్యలో స్థానాలు వచ్చాయి.
     
    కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం అధికారంలో ఉన్న పార్టీగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. టీఆర్‌ఎస్ నేత కొండా మురళీధర్‌రావుకు మళ్లీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు సైతం ఈ ఎమ్మెల్సీపైనే దృష్టి పెట్టినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రవీందర్‌రావు సొంత నియోజకవర్గం మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్ కావడంతో ఈ అంశాన్ని పార్టీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని గులాబీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్సీ పోస్టులు ఆశిస్తున్న నాయకులకు ఇప్పటికిప్పుడు ఈ పదవులను ఇవ్వడం సాధ్యంకాకపోతే రాష్ట్ర స్థాయి శాఖల కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టే అవకాశం ఉంది.
     
    జిల్లాలో ఎక్కువే...
     
    టీఆర్‌ఎస్ అభివృద్ధి కోసం పనిచేసిన జిల్లా, మండల స్థాయి నాయకులు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టారు. జిల్లాకు సంబంధించి నా లుగు నియోజకవర్గాల్లో ప్రభావం ఉండే కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ పదవి ప్రస్తుత ఖాళీగా ఉంది. నగరంలోని జిల్లా స్థాయి నేతలు దీనిపై ఆశలు పెట్టుకున్నారు.

    ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చేపట్టిన జిల్లా గ్రం థాయల సంస్థ, వినియోగదారుల మండలితోపాటు ఏనుమాముల, జనగామ, మహబూబాబాద్, కేసముద్రం, వర్ధన్నపేట, తొర్రూరు, కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్, చేర్యాల, ములు గు, పరకాల, ఆత్మకూరు మార్కెట్ కమిటీలు, కొమురవెళ్లి, కోటంచ, కురవి, ఐనవోలు, పాల కుర్తి, చెల్పూరు వంటి ఆలయాల కమిటీ చైర్మ న్లు, మల్లూరు, మేడారం వంటి ఆలయ కమిటీలు టీఆర్‌ఎస్ నాయకులకు దక్కనున్నాయి. గ్రామ స్థాయిలో ముఖ్య నాయకులకు మార్కెట్ కమిటీల్లో డెరైక్టర్లుగా, ఆలయ కమిటీల్లో సభ్యులుగా స్థానం దక్కనుంది. గరిష్టంగా ఆరు నెలల్లో కాంగ్రెస్ వారి స్థానంలో టీఆర్‌ఎస్ నేతలు వీటిలో నియమితులయ్యే అవకాశం ఉంది.

    కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలంగా పని చేసిన వారు ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. విశ్వవిద్యాలయం పాలకమండలిలో ప్రాతినిథ్యంపై టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండే పలువురు విద్యావంతులు, మేధావులు ఆశావాహ దృ క్పథంతో ఉన్నారు. న్యాయ విభాగంలో ఉండే ప్రభుత్వ పోస్టుల విషయంలో న్యాయవాదులు ఆశతో ఉన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఇవన్నీ భర్తీ కానుండడంతో ఈ వర్గాల వారు తమతమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
     

మరిన్ని వార్తలు