కొత్త విద్యా సంవత్సరంపై పునరాలోచన

7 Apr, 2017 00:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త విద్యా సంవత్సరాన్ని మార్చి 21న ప్రారంభించిన ప్రభుత్వం మళ్లీ పునరాలోచనలో పడింది. జూన్‌ నుంచే దీన్ని కొనసాగించాలని యాజమాన్యాల నుంచి డిమాండ్లు వస్తుం డగా, కొంత మంది జిల్లా కలెక్టర్లు కూడా ముందస్తు ప్రారంభం వల్ల ప్రయోజనం ఉండబోదని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 3న ప్రారంభించిన బడిబాట కార్యక్రమంపై గురువారం విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వార్షిక పరీక్షలు ముగిసినం దున చాలా మంది పిల్లలు స్కూళ్లకు రావట్లేదని, టీచర్లు కూడా ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ విధులకు వెళ్లారని పలువురు కలెక్టర్లు పేర్కొన్నారు. మిగతా టీచర్లు బడిబాటలో పాల్గొం టున్నారని తెలిపారు. దీంతో విద్యార్థులకు బోధన జరగట్లేదని చెప్పారు. దీనిపై రంజీవ్‌ ఆర్‌ ఆచార్య స్పందిస్తూ దీనిపై సమీక్షిస్తామన్నారు. ఈసారి ప్రయోగాత్మకం గా మార్చి 21 నుంచే సీబీఎస్‌ఈ తరహాలో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పుస్తకాలు, యూనిఫారాలు కూడా ఇచ్చామన్నారు.

ఈనెల 23 తర్వాత పాఠశాలకు వేసవి సెలవులిస్తే జూన్‌ వరకు అంగన్‌వాడీ విద్యార్థులకు భోజనం ఎవరు పెట్టాలన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కలెక్టర్లు కోరారు. ఐదో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తరగతులు ప్రారంభిస్తున్నందున ఐదో తరగతి పూర్తయిన వారు ఆరో తరగతిలో చేరేందుకు సరిపడ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు లేవని, వారి పరిస్థితి ఏంటని వారు వివరణ కోరారు. దీంతో 6వ తరగతి నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రంజీవ్‌ ఆర్‌ ఆచార్య వివరించారు. సమావేశంలో పాఠశాల విద్యా డైరెక్టర్‌ కిషన్, సర్వ శిక్షా అభియాన్‌ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ భాస్కర్‌రావు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు