బీరు.. యమ జోరు! 

15 Apr, 2019 02:28 IST|Sakshi

తెగ తాగేస్తున్న యువత

మార్చిలో రికార్డు స్థాయిలో విక్రయాలు

ఐపీఎల్‌ మ్యాచ్‌లు, ఎన్నికలే కారణం

రూ.1,743 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బీర్ల విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు ఏకంగా రెండింతలు పెరగడం ఎక్సైజ్‌ శాఖనే ఆశ్చర్యపరిచింది. నూతన సంవత్సరం వేడుకలు జరిగే డిసెంబర్, జనవరి నెలల కన్నా.. మార్చిలో రెండు రెట్లు అధికంగా బీర్ల విక్రయాలు జరగడం గమనార్హం. వేసవి కావడంతో చల్లదనం కోసం తాగుతున్నారు అనుకున్నా.. గత విక్రయాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటున్నాయి. 

ఐపీఎల్, ఎన్నికలే కారణం.. 
వేసవి మొదలైనప్పటి నుంచి బీరు బాటిళ్ల విక్రయాలు పెరగడం అత్యంత సహజం. కానీ, ఈసారి మార్చిలో రెండింతలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది ఐపీఎల్‌ మ్యాచ్‌లు కాగా, రెండోది పార్లమెంటు ఎన్నికలు. మార్చి రెండో వారంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు మొదలుకావడంతో బీర్ల కొనుగోళ్లు ఊపందుకుంది. దీనికితోడు అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. దీంతో అటు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్‌లు ఓ వైపు, రాజకీయ పార్టీలు మరోవైపు భారీగా బీర్లను కొనుగోలు చేశాయి.

ఈ కొనుగోళ్లలో రాజకీయ పార్టీల వాటానే అధికంగా ఉందని సమాచారం. తమ కార్యకర్తలకు, యువతకు పంచేందుకు కేసుల కొద్దీ బీర్లను పంచారు. వేసవి కావడంతో మద్యం బాటిళ్లకు బదులుగా బీర్లను ఎంచుకోవడమే దీనికి కారణం. ఫలితంగా బీర్ల కేసులు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. సాధారణంగా ఎక్సైజ్‌ శాఖ విక్రయాల ప్రకారం.. ఐఎమ్‌ఎల్‌ (ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌) అంటే బ్రాండీ వైన్‌ తదితరాలతో కలపకుండా బీర్లను ప్రత్యేకంగా గణిస్తారు. సాధారణంగా తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ మద్యం విక్రయాలు నెలకు సగటున రూ.1,500 నుంచి రూ.1,700 కోట్లుగా ఉంటుంది. వివిధ కాలాల్ని బట్టి వీటిలో మద్యం, బీర్ల విక్రయాలు మారుతుంటాయి. గత 4 నెలల మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. బీర్ల కేసులు పెరగడం గమనించవచ్చు.

 

మరిన్ని వార్తలు