గుండె చికిత్సలో రికార్డు

14 Jul, 2018 01:15 IST|Sakshi
ఆపరేషన్‌ చేయించుకున్న అనసూర్యమ్మతో డాక్టర్‌ శేషగిరిరావు బృందం

     81 ఏళ్ల మహిళకు 2 ధమనులు, గుండె రంధ్రాలకు ఏకకాల చికిత్స

     విజయవంతంగా చేసిన నిమ్స్‌ కార్డియాలజీ మాజీ హెడ్‌ డాక్టర్‌ శేషగిరిరావు

సాక్షి, హైదరాబాద్‌: ఒకేసారి గుండె ధమనులు రెండూ పూర్తిగా పూడుకుపోవడం, అలాగే గుండెలోని చెడు, మంచి రక్తాలను వేరుచేసే గోడకు రంధ్రం ఏర్పడటం వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏకకాలంలో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత నిమ్స్‌ మాజీ కార్డియాలజీ హెడ్, ఇండో–యూఎస్‌ సూపర్‌ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగ ప్రస్తుత హెడ్‌ డాక్టర్‌ శేషగిరిరావుకు దక్కింది. ఇటువంటి సంక్లిష్టమైన చికిత్స చేసిన విషయంపై వైద్య చరిత్రను, జర్నల్స్‌ను పరిశీలించామని, కానీ ఆపరేషన్‌ విజయవంతమైన రికార్డు ఎక్కడా నమోదు కాలేదని శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ విజయవంతం కావడం తమనే నివ్వెర పరుస్తోందన్నారు. పైగా తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) కింద ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేసినట్లు ఆయన వివరించారు.

ఈ మేరకు శుక్రవారం డాక్టర్‌ శేషగిరిరావు విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం పట్టణానికి చెందిన 81 ఏళ్ల అనసూయమ్మకు గుండెపోటు రావడంతో స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకొని ఇండో–యూఎస్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చారన్నారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసి చూడగా రెండు ధమనులు మొదట్లోనే పూడుకుపోయాయన్నారు. ఇలా రెండూ పూడుకుపోవడం వెయ్యిలో ఒకరిద్దరు రోగులకు మాత్రమే వస్తుందన్నారు. పైగా బీపీ స్థాయి 60కి పడిపోవడంతో తాము కంగారు పడ్డామన్నారు.

మరోవైపు గుండె గోడలకు రంధ్రం ఏర్పడటంతో పరిస్థితి విషమించిందన్నారు. కానీ వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముగ్గురు సభ్యుల వైద్యుల బృందం కలిసి విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించామన్నారు. సాధారణంగా కాలి నుంచి ఆపరేషన్‌ చేస్తామని, కానీ ఈ కేసులో మెడ రక్తనాళాల నుంచి గుండెకు పడిన రంధ్రాన్ని పూడ్చామన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్‌ శివప్రసాద్, డాక్టర్‌ శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు