సింగరేణి చరిత్రలోనే రికార్డు టర్నోవర్‌!

2 Apr, 2019 03:37 IST|Sakshi

21 శాతం వృద్ధితో రూ.25,828 కోట్ల ఆర్జన 

బొగ్గు రవాణాలో 5 శాతం పెరుగుదల 

బొగ్గు ఉత్పత్తిలో 4 శాతం, సింగరేణి వార్షిక ఫలితాల ప్రకటన  

కార్మికులకు అభినందనలు తెలిపిన సీఎండీ శ్రీధర్‌

గోదావరిఖని/సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2018–19 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధిక టర్నోవర్, బొగ్గు రవాణా, ఉత్పత్తి సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా టర్నోవర్‌ (అమ్మకాల)లో 21 శాతం ,బొగ్గు రవాణాలో 5 శాతం ,బొగ్గు ఉత్పత్తిలో 4 శాతం వృద్ధిని సాధించింది. రికార్డు స్థాయిలో రూ.25,828 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 2017–18లో సాధించిన రూ.21,323 కోట్ల టర్నోవర్‌ కన్నా ఇది 21 శాతం అధికం. బొగ్గు రవాణాలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటి 101 శాతంతో 676.73 లక్షల టన్నుల బొగ్గును వివిధ పరిశ్రమలకు రవాణా చేసింది.

అంతకు ముందు ఏడాది రవాణా చేసిన 646.19 లక్షల టన్నులతో పోల్చితే 5 శాతం వృద్ధి నమోదు చేసింది. 4 శాతం వృద్ధి రేటుతో 644.05 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. అంతకు ముందు ఏడాది 620 లక్షల టన్నుల ఉత్పత్తి చేసింది. సింగరేణిచరిత్రలో ఇంతపెద్ద మొత్తం లో టర్నోవర్, బొగ్గు రవాణా, ఉత్పత్తి సాధిం చడం ఇదే తొలిసారి అని సంస్థ సీండీ ఎన్‌.శ్రీధర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సింగరేణి కార్మికులు, అధికారులు, పర్యవేక్షక సిబ్బందికి, యూనియన్‌ నేతలకు తన అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడితో కొత్త ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ పురోగమించాలని పిలుపునిచ్చారు. బొగ్గు రవాణాకు సహకరించిన రైల్వే శాఖకు ఆయన తన ధన్యవాదాలు తెలియజేశారు. 

బొగ్గు రవాణాలో సరికొత్త రికార్డు 
గత ఆర్థ్ధిక సంవత్సరంలో మొత్తం 10,422 రైల్వేర్యాకుల ద్వారా బొగ్గురవాణా చేసిన కంపెనీ, ఈ ఏడాది 12,372 ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరిపి 18.71 శాతం వృద్ధిని నమోదుచేసింది. గత ఏడాది సగటున రోజుకు 28.5 ర్యాకుల ద్వారా రవాణా జరగగా ఈ ఏడాది 34 ర్యాకులకు పెరిగింది. మార్చిలో అత్యధికంగా సగటున 41 ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరగడం విశేషం. ఈ నెలలో మొత్తం 1,270 ర్యాకుల ద్వారా రవాణా జరిపారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో కొత్తగూడెం, ఇల్లెందు, శ్రీరాంపూర్, మందమర్రి, అడ్రియా లాంగ్వాల్‌ ఏరియా ప్రాజెక్టులు గత ఏడాది కన్నా ఎక్కువ వృద్ధిని కనబరుస్తూ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ముందంజలో ఉన్నాయి. రైల్వే ద్వారా బొగ్గు రవాణాలో కూడా ఏరియా లు మంచి వృద్ధిని సాధించాయి. కొత్తగూడెం 18 శాతం, ఇల్లెందు 64, మందమర్రి 31.5, శ్రీరాంపూర్‌ 41.3, బెల్లంపల్లి 3.26, రామగుండం–2 ఏరియా 5 శాతం వృద్ధిని సాధించాయి. 

రైల్వే శాఖతో సమన్వయం 
బొగ్గును వెంటనే రవాణా చేయకపోతే స్టాకు పెరిగి ఇబ్బంది అవుతోంది. వినియోగదారుల అవసరాల మేరకు ఎప్పటికప్పుడు రైలు ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరపటానికి సంస్థ యాజమాన్యం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ అత్యధిక ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరగడానికి చర్యలు తీసుకుంది. సింగరేణిలో గతంలో రోజుకు సగటున 30 ర్యాకులు దాటి బొగ్గు రవాణా జరగడంలేదు. కానీ ఈ ఏడాది ఇది 40 ర్యాకులకు చేరడం గమనార్హం. 

తెలంగాణ పవర్‌ హౌస్‌కు సరఫరా 
అనేక రాష్ట్రాల్లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా తగినంత లేక ఇబ్బందులు పడగా, సింగరేణి సంస్థ నుండి బొగ్గును స్వీకరిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఏవీ బొగ్గు కొరతను ఎదుర్కొనలేదు. గరిష్ఠ స్థాయిలో విద్యుత్‌ వినియోగం ఉన్న సమయంలో కూడా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు లోటు రాకుండా చూడగలిగింది. టీఎస్‌జెన్‌కోతో ఉన్న ఒప్పం దం ప్రకారం 2018–19లో 106.7 లక్షల టన్ను ల బొగ్గు సరఫరా చేయాల్సి ఉండగా సింగరేణి 129.6 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. ఇది 21 శాతం ఎక్కువ.

అలాగే ఎన్టీపీసీ కేంద్రాలకు ఒప్పందం ప్రకారం 112 లక్షల టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా 119 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. అలాగే ఇతర రాష్ట్రాల్లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు కూడా తగినంత బొగ్గు సరఫరా చేయగలిగింది. ఆంధ్రప్రదేశ్‌కు 78 లక్షల టన్నులు, తమిళనాడుకు 8.4 లక్షల టన్నులు, కర్నాటకకు 54 లక్షల టన్నులు, మçహారాష్ట్రకు 42 లక్షల టన్నులు సరఫరా చేసింది. అలాగే వివిధ పరిశ్రమల్లో కాప్టివ్‌ పవర్‌ ప్లాంటులకు 37 లక్షల టన్నులు, సిమెంటు పరిశ్రమలకు 29 లక్షల టన్నులు, చిన్నతరహా పరిశ్రమలకు 15.6 లక్షల టన్నులు , సిరమిక్స్‌ తదితర 2,000 పరిశ్రమలకు 47 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడం జరిగింది. 

మరిన్ని వార్తలు