భూపతిరెడ్డి కాంగ్రెస్‌ వ్యక్తే

7 Jun, 2019 05:45 IST|Sakshi

సోనియా, రాహుల్‌గాంధీలను కలిశారు

కాంగ్రెస్‌ తరఫున అసెంబ్లీకి పోటీ కూడా చేశారు

ఎమ్మెల్సీగా అనర్హత వేటు రాజ్యాంగబద్ధమే

హైకోర్టులో మండలి తరఫున అదనపు ఏజీ వాదన

నేడు యాదవరెడ్డి, నాయక్‌ల కేసుల విచారణ  

సాక్షి, హైదరాబాద్‌: ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయడానికి సంబంధించిన రికార్డులు, వీడియోలను శాసన మండలి హైకోర్టుకు నివేదించింది. గతంలో హైకోర్టు ఆదేశించిన మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనానికి వీటిని మండలి తరఫు న్యాయవాది అందజేశారు. మండలి చైర్మన్‌ తమపై ఏకపక్షంగా అనర్హత వేటు వేశారని పేర్కొంటూ భూపతిరెడ్డి, కె.యాదవరెడ్డి, ఎస్‌.రాములు నాయక్‌ వేరువేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలు గురువారం ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి.

భూపతిరెడ్డిని టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయడం జరిగిందని, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తిగా పనిచేయడం వల్లే ఆయనను ఎమ్మెల్సీగా అనర్హుడిని చేస్తూ శాసనమండలి చైర్మన్‌ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని మండలి తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదించారు. భూపతిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదని చెబుతున్నారని, మీ వద్ద ఉన్న ఆధారాల గురించి చెప్పాలని ధర్మాసనం కోరింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్‌ రూరల్‌ స్థానం నుంచి భూపతిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారని, ఈ విషయాన్ని భూపతిరెడ్డే స్వయంగా తన కౌంటర్‌ వ్యాజ్యంలో పేర్కొన్నారని రామచంద్రరావు బదులిచ్చారు.

ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలను భూపతిరెడ్డి కలిశారని, కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారని, పోస్టర్లు కూడా ఉన్నాయని, పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఏనాడూ వాటిని భూపతిరెడ్డి మీడియా సమావేశాల్లో ఖండించలేదన్నారు.  భూపతిరెడ్డి తన వ్యాజ్యంలో రాజ్యాంగంలోని 8వ పేరాను ప్రశ్నించడంపై కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సభ్యుల అనర్హత అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం శాసనమండలి చైర్మన్‌కు ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఆయన ఉదహరించారు.

దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఇప్పటివరకూ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ 6,7 పేరాలపై రాజ్యాంగ ధర్మాసనాలు సమీక్షించాయని, ఇప్పుడే తొలిసారి అదే షెడ్యూల్‌లోని పేరా 8ని సవాల్‌ చేయడం జరిగిందని గుర్తు చేసింది. పేరా 8కి ఉన్న రాజ్యాంగబద్ధతపై లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వాలని, దీనిపై లోతుగా అధ్యయనం చేసి 10వ తేదీన జరిగే విచారణ సమయంలో చెప్పాలని కేంద్రం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్‌ల కేసులపై శుక్రవారం విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది.   

>
మరిన్ని వార్తలు