మన్నుతిన్న కృష్ణమ్మ..!

31 May, 2014 02:26 IST|Sakshi
మన్నుతిన్న కృష్ణమ్మ..!

సాగర్ ప్రాజెక్టుకు పూడిక ముప్పు
- తగ్గిన 100టీఎంసీల
- నీటి నిల్వ సామర్థ్యం కృష్ణా పరీవాహక ప్రాంతంలో అడవుల విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణం

నాగార్జునసాగర్, న్యూస్‌లైన్, నాగార్జునసాగర్ జలాశయంలో పూడిక పేరుకుపోతోంది. ప్రస్తుతం నీటి అడుగున సగం మేర మేట వేసింది. పది కాదు..పాతిక కాదు..ఏకంగా వంద టీఎంసీల నీటి నిల్వ ప్రదేశాన్ని మన్ను మింగేసింది.  జలాశయంలో రోజురోజుకూ పూడిక పేరుకుపోతుందన్న విషయం తెలిస్తే.. భవిష్యత్తుపై బెంగ లుగుతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మున్ముందు డ్యామ్‌కు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
వంద టీఎంసీల నీరు తగ్గుదల
నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఏర్పడిన 50 ఏళ్లలోనే 100టీఎంసీల నీరు పూడిక కారణంగా తగ్గిపోయింది. జలాశయం పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 408.24 టీఎంసీలు. ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా అధికారులు నిర్ధారించారు. సాగర్ జలాశయం రిజర్వాయర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు. కనిష్ట నీటిమట్టం 490 అడుగులు.

సముద్రమట్టం (246 అడుగులు) నుంచి490 అడగుల వరకు ఉన్న డెడ్ స్టోరేజీలో 166టీఎంసీలు. 490 అడుగుల నుంచి 590అడుగుల వరకున్న లైవ్‌స్టోరేజీలో 242టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో 133టీఎంసీలు, లైవ్‌స్టోరేజీలో 175టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. లైవ్‌స్టోరేజీలో 67టీఎంసీల నీరు తగ్గిపోవడం గమనార్హం.

ఒక పంటకు నీరివ్వడానికి...
 నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల కింద ఒక పంటకు నీరివ్వడానికి 264 టీఎంసీల నీరు అవసరం. కృష్ణా డెల్టాకు 70టీఎంసీలు. హైదరాబాద్ నగరానికి, పలు జిల్లాలకు తాగునీటి అవసరాలకు 100 టీఎంసీల నీరు అవసరమవుతుంది. సాగర్, శ్రీశైలం జలాశయాల్లో పూడిక నిండి నీటి నిల్వల శాతం తగ్గితే భవిష్యత్తులో తాగు, సాగునీటికి కష్టమే.


ఈ పూడిక ఎలా వస్తుంది...?
కృష్ణానది పరీవాహక ప్రాంతం (క్యాచ్‌మెంటు ఏరియా) 2,58,948 చదరపు కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ ప్రాంతంలో అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం... పట్టణీకరణ పెరగడం, బంజరు భూములు వ్యవసాయ పొలాలుగా మారడం కూడా నీటి ప్రవాహంలో పూడికకు కారణం అవుతుంది. అడువులు ఉంటే నీటి ఉధృతికి చెట్లు అడ్డుపడి పూడిక రావడం తగ్గుతుంది.

వర్షాలు.. వరదలు వచ్చినప్పుడు నది నుంచి జలాశయంలో పూడిక చేరడం ఎక్కువవుతుంది. ఎందుకంటే సాధారణంగా పెద్దపెద్ద వరదలు ఏకకాలంలో వస్తాయి. ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. దీనివల్ల పూడిక కూడా వేగంగా వచ్చి చేరుతుంది.

పరిష్కారం ఏమిటి?
పూడికను అరికట్టడానికి ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడే పరిష్కారం గురించి ఇంజినీరింగ్ నిపుణులు ఆలోచించాలి. ఆలాంటిదేమీ జరగలేదు. జలాశయాల్లోని పూడిక తీయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఏమీలేదు. తీసిన పూడిక ఎక్కడ పోయాలనేది సమస్య. చుట్టూ ఉన్న కొండలమీద పోస్తే మళ్లీ వరదలకు కొట్టుకువస్తుంది.

నల్లమల అడవులలోని గట్టలపై నుంచి వచ్చే వరదకు అడ్డంగా అక్కడక్కడ గోడలు నిర్మించాలి. జలాశయం చివర్లలో మేటవేసిన ఒండ్రు మట్టిని దగ్గరలో ఉన్న రైతులు పొలాల్లోకి ఉపాధి హామీ పనుల్లో భాగంగా తోలుకపోతే గుడ్డిలో మెల్లెగా ఉంటుంది. విదేశాల్లోనయితే డ్యాం నిర్మించేటప్పుడు పైన చిన్నచిన్న ప్రాజెక్టులు నిర్మించి పూడికను అరికడతారు.

మన కర్తవ్యమేంటి?
- నీటిని నిల్వ చేయడంకోసం మైదానప్రాంతంలో పెద్దపెద్ద రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవాలి.
- ఉన్న చెరువులను త వ్వి జలాశయాలుగా మార్చుకోవాలి.
- వరదలు భారీగా వచ్చి నీరంతా సముద్రంలో కలిసే సమయంలో వరద కాలవ, ఎస్‌ఎల్‌బీసీ, కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని తరలించి ఆ జలాశయాలు నింపుకోవాలి.
- నీటి యాజమాన్యంపై రైతాంగానికి శిక్షణ నిచ్చి నీటి విలువల గురించి తెలియజేయాలి. ఆవిధంగా తరిగిపోయే ఆయకట్టును పెంచుకోవచ్చని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు