బీర్లు నోస్టాక్‌!

28 May, 2019 01:43 IST|Sakshi

రాష్ట్రంలో బీర్ల కొరత... 15–20 రోజుల నుంచి ఇదే పరిస్థితి.. మండు వేసవిలో పెరిగిన బీర్ల వినియోగం... 

భారీగా తగ్గిన బీర్ల ఉత్పత్తి

60 లక్షల కేసుల డిమాండ్‌ ఉంటే తయారవుతోంది 30–35 లక్షల కేసులే

సింగూరు జలాశయం నుంచి నీటి నిలుపుదలే ప్రధాన కారణం

బేవరీల నుంచి కార్పొరేషన్‌కు తగ్గిన సరఫరా.. డిపోల్లో అమలవుతున్న ‘రేషన్‌’

నిరాశతో వైన్‌షాపు సిబ్బందితో గొడవలు పడుతున్న బీరుప్రియులు

సాక్షి, హైదరాబాద్‌: చల్లని బీరు.. హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. బీరు ప్రియం అయింది.. ఈ కబురు బీరుప్రియులకు అప్రియం అయింది. చాలా వైన్‌షాపుల్లో ‘నో స్టాక్‌’.. ‘బీర్లు లేవు’.. ‘ఒకరికి ఒక్క బీరు మాత్రమే’.. బీర్‌ ‘కూల్‌’లేదు.... వంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. మండే ఎం డల్లో చల్లని బీరు కోసం వెళ్లిన బీరుప్రియులు నిరాశతో వెనుదిర గాల్సి వస్తోంది. వినియోగం పెరగడంతోపాటు ఉత్పత్తి కూడా తక్కువ కావడంతో 15–20 రోజుల నుంచి రాష్ట్రంలో బీరు దొరకడమే గగనమైపోయింది. 

ఐదు బేవరేజెస్‌కూ నీళ్లు బంద్‌
రాష్ట్రంలో బీరు ఉత్పత్తి చేసే ఐదు బేవరేజెస్‌ కంపెనీలు సింగూరు జలాశయం పరిధిలోనే ఉన్నాయి. ఎగువ నుంచి నీటి ప్రవాహాలు లేకపోవడం, సింగూరు జలాశయంలో నీళ్లు తక్కువగా ఉండడంతో రోజువారీ తాగునీటి అవసరాల కోసం ఆదా చేయాలన్న ఉద్దేశంతో ఈ జలాశయం నుంచి బేవరేజెస్‌కు నీటి సరఫరాను ప్రభుత్వం మార్చి 1 నుంచి నిలిపివేసింది. దీంతో ఆయా బేవరేజెస్‌ కంపెనీలున్న పరిసరాల్లోని బోర్లు, ప్రత్యేకంగా ట్యాంకుల్లో తెప్పించుకుంటున్న నీళ్ల ద్వారా బీర్ల తయారీ సాగుతోంది. తగినంత నీటి సరఫరా లేకపోవడంతో డిమాండ్‌కు అనుగుణంగా బీర్ల ఉత్పత్తి జరగడం లేదు. ఏప్రిల్, మే మాసాల్లో నెలకు సగటున 60 లక్షల కేసుల బీర్ల డిమాండ్‌ ఉండగా, బేవరీల నుంచి 30–35 లక్షల కేసులు మాత్రమే ఉత్పత్తి అవుతుండడంతో ఈ కొరత ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. 
సిద్దిపేట జిల్లాలోని ఓ వైన్‌షాప్‌ వద్ద బీర్లు లేవు అని పది రోజుల నుంచి దర్శనమిస్తున్న బోర్డు 

డిపోల్లో ‘రేషన్‌’షురూ... 
బీర్ల ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో మద్యం డిపోల్లో రేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి షాపునకు వేసవిలో రోజుకు 150–200 కేసుల బీర్లు అమ్మే సామర్థ్యమున్నా కేవలం 30–50 కేసుల బీర్లు మాత్రమే ఇస్తున్నారు. ఈ బీర్లు వచ్చిన రెండు గంటల్లోపే అమ్ముడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల వైన్‌షాప్‌ యజమానులు ఒకరికి ఒక బీరు మాత్రమే ఇస్తు న్నారు. అయినా బీర్లు సరిపోక పోవడంతో బీరు ప్రియులు వైన్‌షాపుల సిబ్బందితో గొడవలు పడాల్సి వస్తోంది. అయితే, బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మాత్రం బీర్ల కొరత పెద్దగా లేదు. ఆయా రెస్టారెం ట్లకు డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటిలాగే డిపోల నుంచి బీర్లు సరఫరా అవుతుండడం, వైన్‌షాపులతో పోలిస్తే రెస్టారెంట్లకు వెళ్లి బీర్లు తాగేవారి సంఖ్య కూడా తక్కువ కావడమే దీనికి కారణం. 

మళ్లీ వర్షాలు పడితేనే!
సింగూరు జలాశయంలో నీటినిల్వలను బట్టి చూస్తే మళ్లీ వర్షాలు పడి భూగర్భజలాల్లో పెరుగుదల కనిపిస్తేనే బీర్ల తయారీ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. నీటికొరత కారణంగానే బీర్ల కొరత ఏర్పడిందని, మళ్లీ నీళ్లు పుష్కలంగా వస్తే తప్ప చేసేదేమీ లేదని వారంటున్నారు. ఎప్పటిలాగే బేవరేజెస్‌ తాము ఈ వేసవిలో కూడా అధికంగా బీర్లు తయారు చేయాలని ఇండెంట్లు ఇచ్చామని, నీటిసరఫరా లేకపోవడంతోనే బీర్ల తయారీ తగ్గిపోయిందని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణుడు కరుణిస్తే కానీ రాష్ట్రంలోని బీరు ప్రియుల దాహం తీరనుంది.

గత మూడు నెలల్లో బీర్ల అమ్మకాలు...52,70,660కేసులు మార్చి నెలలో..
ఏప్రిల్‌లో.. 52,70,077కేసులు
మేలో.. 48,71,668కేసులు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా