‘రీజినల్‌’ భూసేకరణలో సగం ఖర్చు రాష్ట్రానిదే

9 Jan, 2019 03:03 IST|Sakshi

పార్లమెంటులోకేంద్ర మంత్రి మాండవీయ ప్రకటన

ఇందుకు తెలంగాణ అంగీకరించిందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు అవసరమయ్యే భూసేకరణ వ్యయంలో తెలంగాణ సగభాగం భరించనుంది. ఈ ప్రాజెక్టు పనులకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపామని, భూసేకరణలో సగం ఖర్చు తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు అంగీకరించిందని కేంద్ర మంత్రి ఎం.ఎల్‌. మాండవీయ సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. మొత్తం 334 కి.మీ.ల మార్గాన్ని రెండు దశల్లో నిర్మించనున్నామని, ఈ రెండు రహదారులను ఇప్పటికే జాతీయ రహదారులుగా గుర్తించామని ప్రకటించారు.

భవిష్యత్తులో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌...
రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణంలో భూసేకరణ అత్యంత కీలకమైన ప్రక్రియ. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 12,000 కోట్లుకాగా అందులో భూసేకరణకు దాదాపు రూ. 2,500–రూ. 3,000 కోట్లు వ్యయమవనుంది. ఈ ప్రాజెక్టు కోసం నిర్మించేది అత్యంత అధునాతనమైన ఎక్స్‌ప్రెస్‌ హైవే కాబట్టి రహదారికి ఎక్కడా వంపులు, మలుపులు లేకుండా జాగ్రత్త తీసుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న రోడ్డును కాకుండా మొత్తం గ్రీన్‌ఫీల్డ్‌ భూములను తీసుకోవాలని నిర్ణయించారు. హైదరాబాద్‌కు 50 కి.మీ.ల దూరంలో, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు 30 కి.మీ.ల దూరంలో నిర్మించనున్న ఈ రహదారి అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో ఎదురయ్యే రాజధాని ట్రాఫిక్‌ కష్టాలు తీరతాయి.

సేకరించి అప్పగించే బాధ్యత తెలంగాణదే..
ఆరు వరుసల్లో నిర్మించే రీజినల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి 4,500 హెక్టార్లు.. అంటే 11,000 ఎకరాలు అవసరమవుతాయి. దీని భూసేకరణ, అందుకు అవసరమైన మొత్తం రూ. 3,000 కోట్లలో సగం అంటే రూ. 1,500 కోట్ల భారాన్ని తెలంగాణ భరించనుంది. ఇప్పటికే డీపీఆర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. భూసేకరణలో న్యాయ, సాంకేతిక చిక్కులు ఎదురవకుండా ప్రాజెక్టు సాఫీగా సాగిపోయేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు ఉన్న రహదారి (154 కి.మీ.)ని ఎన్‌హెచ్‌ఏఐ నోటిపై చేసి 166 ఏఏ నంబర్‌ ఇచ్చింది. ఇక భువనగిరి–షాద్‌నగర్‌ (180 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా గుర్తించినప్పటికీ ఇంకా దీనికి నంబర్‌ ఇవ్వాల్సి ఉంది.

ఎన్‌.హెచ్‌. 563 నేర్పిన పాఠాలెన్నో
ఇటీవల జగిత్యాల–ఖమ్మం వరకు ఉన్న రోడ్డును విస్తరించి జాతీయ రహదారిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఎన్‌హెచ్‌ఏఐ కూడా ఆమోదించి నోటిఫై చేసి 563 నంబర్‌ ఇచ్చింది. ఇందుకోసం పలుచోట్ల భూసేకరణ పనులు కూడా మొదలయ్యాయి. పలుచోట్ల మిషన్‌ భగీరథ పైపులు అడ్డుతగలడం, మరికొన్ని చోట్ల ఒకవైపే భూమిని సేకరిస్తున్నారంటూ బాధితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విషయం కోర్టుకు వెళ్లింది. భూసేకరణ క్లిష్టంగా మారడంతో అవాంతరాల మధ్య ఈ ప్రాజెక్టు ఇటీవల నిలిచిపోయింది. ఎన్‌హెచ్‌ 563 ప్రాజెక్టు అర్ధంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో అధికారులు రీజినల్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు భూసేకరణ విషయంలో సమస్యలు రాకుండా డీపీఆర్‌ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు