వరంగల్ నిట్‌లో గంజాయి.. అసలు నిజం!

19 Nov, 2019 14:15 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : జిల్లా కేంద్రంలోని నిట్‌ క్యాంపస్‌లో గంజాయి సేవిస్తూ ఫస్టియర్‌ విద్యార్థులు పట్టుబడ్డారని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ స్పష్టతనిచ్చారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎస్‌. గోవర్థన్‌ రావు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడిన విషయాన్ని నిర్ధారిస్తూనే ఈ సంఘటన అక్టోబర్‌ 27వ తేదీ రాత్రిపూట జరిగిందని తెలిపారు. ఆ రోజు సెక్యూరిటీ సిబ్బంది రొటీన్‌ చెకప్‌లో భాగంగా తనిఖీ చేస్తున్నప్పుడు 1.8కె హాస్టల్‌ గదిలో మొదటి సంవత్సరం చదువుతున్న 12 మంది విద్యార్ధులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని పేర్కొన్నారు.

అయితే మీడియాలో వచ్చినట్టుగా వారివద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు. తక్కువ మోతాదులో మొదటిసారి వారు గంజాయి వాడారని విచారణలో తేలిందని తెలియజేశారు. ఈ విషయంపై క్రమశిక్షణా కమిటీ వేసామని, ఆ కమిటీ ముందు విద్యార్థులు తమ తప్పు ఒప్పుకున్నారని వివరించారు. వీరిపై చర్య తీసుకునే విషయంలో త్వరలో తుది నిర్ణయం వెలువడుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.   

మరిన్ని వార్తలు