రిజిస్ట్రేషన్‌ ఉద్యోగుల ఉద్యమబాట

4 Mar, 2018 03:52 IST|Sakshi

      రాష్ట్రవ్యాప్తంగా సెలవు పెట్టి వెళ్లిపోయిన సబ్‌రిజిస్ట్రార్లు 

      సర్కార్‌ స్పందించకుంటే 12 నుంచి ప్రత్యక్ష ఆందోళన 

సాక్షి, హైదరాబాద్‌: రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. సబ్‌రిజిస్ట్రార్లు లేని చోట్ల తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ బాధ్యతలివ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 141 కార్యాలయాల్లోని సబ్‌రిజిస్ట్రార్లు శనివారం మూకుమ్మడిగా సెలవు పెట్టి హైదరాబాద్‌లోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. అఫ్జల్‌గంజ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి నాంపల్లి సీసీఎల్‌ఏ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి సీసీఎల్‌ఏ డైరెక్టర్, ఇన్‌చార్జి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ వాకాటి కరుణకు వినతిపత్రం సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ శాఖలో రెవెన్యూ సిబ్బంది ప్రమేయాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు.

12 నుంచి ప్రత్యక్షంగా..
ఇప్పటికే రెండు, మూడు సార్లు నివేదించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రత్యక్షంగా ఆందోళన చేపట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు నిర్ణయించారు.  మార్చి 12 వరకు ప్రభుత్వానికి సమయమివ్వాలని భావిస్తున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల వ్యవస్థను స్తంభింపజేసేలా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు