రిజిస్ట్రేషన్‌ విలువలు పెరగనున్నాయ్‌!

19 Dec, 2019 03:32 IST|Sakshi

భూముల విలువలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఉప్పల్‌ భగాయత్‌లో ఇటీవల జరిగిన భూముల వేలంలో గజం రూ.79 వేలకు పైగా ధర పలికింది. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ విలువ రూ.7 వేలు మాత్రమే. కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్‌ విలువ కన్నా మార్కెట్‌ విలువ ఏకంగా 50 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఇటీవల అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. ఆయన సూచన మేరకు ప్రాంతాలను ఆధారంగా 10 శాతం నుంచి 100 శాతం వరకు రిజిస్ట్రేషన్‌ విలువల పెంపు ప్రతిపాదనలను అధికారులు పంపారు. వారం రోజుల్లో దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ పడనుంది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ భేటీలో ఆదాయ పెంపుపై జరిగిన చర్చలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ అంశాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. ప్రజలపై అధిక భారం పడకుండా శాస్త్రీయంగా ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు. అలాగే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సమక్షంలో నిర్వహించిన బిల్డర్ల సమావేశంలో కూడా రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ అంశం చర్చకు రావడంతో ఈ ప్రక్రియ ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే వారం రోజుల్లోనే రిజిస్ట్రేషన్‌ విలువలు సవరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
 
ఇప్పటివరకు జరగని సవరణ... 
వాస్తవానికి, రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువల సవరణ 2013, ఆగస్టులో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంతవరకు ఈ విలువలను సవరించలేదు. ఏడేళ్లు కావడంతో భూముల రిజిస్ట్రేషన్‌ విలువలకు, మార్కెట్‌ ధరలకు పొంతన లేకుండా పోయింది. ఉప్పల్‌ భగాయత్‌లో ఇటీవల భూముల వేలం జరగ్గా గజం రూ.79 వేలకు పైగా ధర పలికింది. కానీ, అక్కడ రిజిస్ట్రేషన్‌ విలువ గజం రూ.7 వేలు మాత్రమే. వ్యవసాయ భూములకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అయితే ఏకంగా రిజిస్ట్రేషన్‌ ధర కన్నా మార్కెట్‌ ధర 50 రెట్లు ఎక్కువకు చేరింది. దీంతో రిజిస్ట్రేషన్‌ ధరలను సవరించడం అనివార్యంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇటీవల జరిగిన కేబినెట్‌ భేటీలో, బిల్డర్ల సమావేశంలో రిజిస్ట్రేషన్‌ విలువల పెంపు అంశం చర్చకు వచ్చింది. వీలున్నంత త్వరగా రిజిస్ట్రేషన్‌ విలువలను  సవరించాలని రెవెన్యూ ఉన్నతాధికారులను బిల్డర్లు కోరారు.

సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు సవరణలపై మరోసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రాంతాలను ఆధారంగా 10 శాతం నుంచి 100 శాతం వరకు రిజిస్ట్రేషన్‌ విలువల పెంపు ప్రతిపాదనలను అధికారులు సీఎం వద్దకు పంపారు. ప్రభుత్వం నిర్ధారించిన భూముల రిజిస్ట్రేషన్‌ విలువను బట్టి సాధారణ సేల్‌ డీడ్‌పై స్టాంపు డ్యూటీ కింది 6 శాతం ఫీజులు వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్‌ విలువల సవరణతో ఆ మేరకు స్టాంపు డ్యూటీ కూడా ప్రభుత్వానికి అధికంగా రానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలకు సీఎం అంగీకారం లభిస్తే ఈ వారం రోజుల్లో రిజిస్ట్రేషన్‌ విలువల సవరణలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగనున్న నేపథ్యంలో దాదాపు విలువల సవరణ ఖాయమని తెలుస్తోంది.    

మరిన్ని వార్తలు