రిజిస్ట్రేషన్‌ @ తహసీల్‌

19 May, 2018 06:43 IST|Sakshi
గుడిహత్నూర్‌ తహసీల్‌లో రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, పరికరాలు

నేటి నుంచి పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు

ఉమ్మడి జిల్లాలో మూడు మండలాలు

ధరణి వెబ్‌సైట్‌కు ప్రారంభానికీ రంగం సిద్ధం 

ఇచ్చోడ(బోథ్‌) : తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద మూడు మండలాలను ఎంపిక చేసింది. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్, మంచిర్యాల జిల్లా నెన్నెల, నిర్మల్‌ జిల్లా నిర్మల్‌ రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానం అమలుకు రంగం సిద్ధమైంది. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌ను రైతులకు చేరువ చేయడంలో భాగంగా మండలంలోనే రిజిస్ట్రేషన్‌ చేసే విధానాన్ని తహసీల్దార్లకు అప్పగించింది. స్థానిక తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలను నిర్వహించనున్నారు. జూన్‌ 2 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయాలు లేని అన్ని మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగించేందుకు రిజిస్ట్రేషన్‌ చట్టం 1908 ప్రకారం జీవో ఎంఎస్‌ 94, 95ను ప్రభుత్వం గత ఐదు రోజుల క్రితం విడుదల చేసింది. దీంతో మూడు మండలాల్లో శనివారం నుంచి రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. 

ఎనిమిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయలు 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎనిమిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్‌ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా మంచిర్యాల, లక్సెట్టిపేటలో సబ్‌రిజిస్ట్రార్‌  కార్యాలయలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం భూముల క్రయవిక్రయాలతోపాటు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు, వివాహ నమోదు, గిఫ్ట్‌డీడ్, భాగస్వామ్య ఒప్పందాలు, ఇçళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్లతోపాటు మరో 20 రకాల సేవలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అందిస్తున్నారు. ఈ శాఖ ద్వారా ప్రతీ సంవత్సరం ప్రభుత్వానికి దాదాపుగా రూ.120 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. 

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆలస్యం
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూముల క్రయవిక్రయాలు, ఆస్తుల మార్పిడితోపాటు పలు సేవల్లో ఆలస్యం జరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లలో రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం, పాసుపుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవడం, ఒక్కోసారి భూములు విక్రయించిన వారు తిరిగి రెండోసారి విక్రయించడం, ఒకే సర్వే నంబర్‌కు రెండు మూడు సార్లు ఇద్దరు, ముగ్గురుకి విక్రయించడం, సర్వే నంబర్‌లో ఉన్న విస్తీర్ణం కంటే రిజిస్ట్రేషన్లలో అధికంగా రికార్డు చేయడం, రిజిస్ట్రేషన్లలో భూముల సరిహద్దుల్లో ఎలాంటి ప్రామాణికాన్ని చూడకపోవడం, రైతులు చెప్పిన విధంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో గ్రామాల్లో అనేక భూ వివాదాలు రెవెన్యూ ఆధికారులుకు సవాల్‌గా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాకత్మంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పలు సంఘటనలు వెలుగు చూశాయి. వీటన్నింటినీ అరికట్టేందుకు ప్రభుత్వం తహసీల్‌ కార్యాలయలో రిజిస్ట్రేషన్‌ విధానం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నేడు ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభం
రైతులకు భూముల వివరాలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ నెల 19న ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభానికి సిద్ధం చేసింది. భూ రికార్డుల నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రైతులకు అందుబాటులో ఉండేవిధంగా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రికార్డులను రెవెన్యూ శాఖ పొందుపర్చనుంది. తహసీల్‌ కార్యాలయలో రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే భూముల, ఆస్తుల క్రయవిక్రయాల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేసే విధంగా ఈ వెబ్‌సైట్‌ రూపుదిద్దుకుందని అధికారులు చెబుతున్నారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న తహసీల్‌ కార్యాలయాల్లో నూతన భవనాలు నిర్మించకుండానే ఓ గదిలో ఈ సేవలు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అరకొర వసతుల మధ్య రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అసలే సిబ్బంది కొరతను  ఎదుర్కొంటుండుగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విధానం తహసీల్‌ కార్యాలయంలో అమలకు నిర్ణయించడంతో రెవెన్యూ సిబ్బందికి సవాల్‌గా మారుతోంది.
 

మరిన్ని వార్తలు