ఆశల ఊసుల్లోనే క్రమబద్ధీకరణ

6 Jul, 2015 02:09 IST|Sakshi
ఆశల ఊసుల్లోనే క్రమబద్ధీకరణ

⇒ జూన్‌లో ఇస్తామన్న ఉత్తర్వులకు ఇంకా దిక్కులేదు
⇒ స్క్రీనింగ్ పరీక్షకు నోటిఫికేషన్ ఎప్పుడు..?
⇒స్థానికులు, స్థానికేతరులతోనే కొత్త పీటముడి
⇒ ఆర్థిక భారం పడుతుందని దాటవేస్తున్న సర్కారు
⇒ 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన

సాక్షి, హైదరాబాద్:  కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఇంకా మోక్షం సిద్ధించలేదు. తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జూన్‌లోనే ఉత్తర్వులు ఇచ్చి... జూలై నుంచి క్రమబద్ధీకరించే కార్యక్రమం చేపడతామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అవతరణ దిన వేడుకల్లో ప్రకటించారు. ఈ సంవత్సరంలోనే అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజులు దాటినా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడ లేదు. జూన్‌లో జరిగిన రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలోనూ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చ జరిగింది. స్థానికులైన కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, తెలంగాణ స్థానికేతరులను గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఆ తర్వాత కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సర్కారు ఊసెత్తకపోవటంతో 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే విషయంలోనే ప్రభుత్వం తమ విధానాన్ని వెల్లడించలేదు. ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు పాటించిన నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులనూ విభజించే వీలుంది. కానీ.. అందుకు సంబంధించిన మార్గదర్శకాల షెడ్యూలును ముందుగా విడుదల చేయాలి. ఆ దిశగా సర్కారు కసరత్తు చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది.

 స్థానికేతరుల గుర్తింపే సమస్య
 ప్రధానంగా స్థానికులు, స్థానికేతరులను గుర్తించాలనే నిర్ణయమే రెగ్యులరైజేషన్‌కు పీటముడిగా మారిందని, అందుకే జాప్యం అవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించటంలో ఇబ్బంది లేదని.. అదే సమయంలో ప్రస్తుతం ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలా.. వద్దా.. అనే సందిగ్ధత కూడా కొనసాగుతోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్క్రీనిం గ్ పరీక్షకు నోటిఫికేషన్ వేసే సమయంలో రెండు రాష్ట్రాల్లో పని చేస్తున్న వారికీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తే ఈ చిక్కుముడి తొలగిపోతుందని కాంట్రాక్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం పంపించాలని తెలంగాణ ఆర్థిక శాఖ అన్ని విభాగాలను కోరింది. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం 28 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే ప్రతి నెలా దాదాపు రూ.9 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది. ఆర్థికం గా రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉం ది. ఈ నేప థ్యంలో కాం ట్రాక్టు ఉద్యోగు ల రెగ్యులరైజేషన్‌ను వేగవంతంగా పూర్తి చేస్తే అంతకంతకు భారం పడుతుంది. అందుకే సర్కారు ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టి సాగదీస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 సీఎం పరిశీలనలో అంశం
 ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సారథ్యంలో సర్కారు నియమించిన ఉన్నతాధికారుల కమిటీ కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్‌కు మార్గదర్శకాలను సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి అంటే గత ఏడాది జూన్ 2 నాటికి అయిదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను మొదటగా రెగ్యులరైజ్ చేయాలని సూచించింది. ఈ కమిటీ నివేదికతో పాటు ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది. ఈలోగా తెరపైకి వచ్చిన స్క్రీనింగ్ పరీక్ష, స్థానికత అంశాలతో ఈ ఫైళ్లు ఎక్కడివక్కడే అన్నట్లుగా ఆగిపోయాయి. దీంతో కాంట్రాక్టు ఉద్యోగుల ఆశలు మళ్లీ కొంతకాలం కంచికి చేరినట్లయింది.

మరిన్ని వార్తలు