వైద్య సిబ్బంది క్రమబద్ధీకరణ...

11 Jun, 2019 02:26 IST|Sakshi

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు 4,201 

ఉన్నచోటు నుంచి లేనిచోటుకు సర్దుబాటు  

కొరతను అధిగమించేందుకు సర్కారు ఆలోచన 

భర్తీ ప్రక్రియ జరిగే వరకు సర్దుబాటే పరిష్కారం 

అధ్యయనం చేయాలని వైద్య ఆరోగ్యమంత్రి ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య సిబ్బందిని క్రమబద్ధీకరించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా వైద్యుల కొరతను నివా రించి రోగులకు సక్రమంగా వైద్యం అందించాలని నిర్ణయించింది. దీనిపై తాజాగా ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఉన్నచోటు నుంచి లేనిచోటుకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని పంపించి సర్దుబాటు చేయాలని, తద్వారా కొరతను తాత్కాలికంగా నివారించాలని ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏయే ఆసుపత్రుల్లో కొరత ఉందో లెక్కలు తీసి తనకు పంపాలని, క్రమబద్ధీకరణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో వైద్యాధికారులు సర్దుబాటు ప్రక్రియపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్రమబద్ధీకరణకు గల అవకాశాలను అధ్యయనం చేస్తున్నారు.  

భర్తీ చేపట్టే వరకు సర్దుబాటు.. 
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) మొదలు బోధనాసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్య సేవలు అందడంలేదు. బోధనాసుపత్రుల్లో వైద్య విద్యార్థులకు పాఠాలు బోధించే పరిస్థితి కూడా లేదన్న చర్చ జరుగుతోంది. ఒక్కోసారి బోధనా సిబ్బంది లేక పలు సందర్భాల్లో ఎంబీబీఎస్‌ సీట్లు రద్దు అయిన సందర్భాలూ ఉన్నాయి. పీజీ సీట్లు కూడా దక్కించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కోసారి ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందంటే ఏమాత్రం బోధనానుభవం లేని ఇతర ఆసుపత్రుల వైద్యులను తీసుకొచ్చి తమ కాలేజీ అధ్యాపకులుగా చూపిస్తున్నారు. అలా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ)ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో పీహెచ్‌సీలు, బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు మొత్తం కలిపి 26,404 మంది ఉండాలి.

అందులో 17,148 మంది పనిచేస్తుండగా... 9,256 ఖాళీలున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో వైద్యుల ఖాళీలే ఏకంగా 4,201 ఉండటం గమనార్హం. అందులో వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో 4,500 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 2,100 మంది మాత్రమే ఉన్నారు. 2,400 ఖాళీలు ఉండటం గమనార్హం. వాటిల్లో నర్సుల ఖాళీలు కూడా 1,158 ఉన్నాయి. ఇక పీహెచ్‌సీల్లో 1,318 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా, 968 మంది పనిచేస్తున్నారు. ఇంకా 350 డాక్టర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధనాసుపత్రుల్లో 2,783 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 1,332 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 1,451 ఖాళీలున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బోధనాసుపత్రుల్లోనే 1,703 నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3,614కు బదులు కేవలం 1,911 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈస్థాయిలో ఖాళీలు ఏర్పడటంతో వైద్య సిబ్బంది కొరత రోగులపాలిట శాపంగా మారింది.  

కొన్నిచోట్ల ఎక్కువ... కొన్నిచోట్ల తక్కువ 
కొరతను నివారించాలంటే ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కానీ దానికి ఉన్నతస్థాయిలో అనుమతి కావాలి. ఆర్థిక శాఖ ఆమోదం అవసరం. ఇన్నిన్ని ఖాళీలను చేపట్టాలంటే ఎంతో కసరత్తు జరగాల్సి ఉంటుంది. అందువల్ల భర్తీ జరిగే వరకు ఆగకుండా క్రమబద్ధీకరణవైపు వెళ్లాలనేది వైద్య ఆరోగ్యశాఖ ఆలోచన. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా తక్కువ మంది సిబ్బంది ఉంటే, కొన్నిచోట్ల పరిస్థితి మెరుగ్గా ఉంది. కొందరు వైద్యులు, నర్సులు పట్టణాలు, నగరాలకు చేరుకున్నారు. సమీప ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. డిప్యుటేషన్లపై మరికొందరు వచ్చి చేరారు. పైరవీలు చేసుకొని మరికొందరు బదిలీలు చేయించుకున్నారు. దీంతో మారుమూల ప్రాంతాల్లో పనిచేసే నాథుడు లేక వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో అధికంగా సిబ్బంది ఉన్నచోటు నుంచి బాగా కొరత ఉన్నచోటుకు పంపించాలనేది తాజా నిర్ణయం ఉద్దేశం. అయితే క్రమబద్ధీకరణ చేపట్టాలంటే అనేకరకాల రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా ఒత్తిళ్లు ఉండే అవకాశముందని అంటున్నారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ ఏ మేరకు కఠినంగా ఉండి అమలు చేస్తుందో చూడాలి.  

మరిన్ని వార్తలు