పాత నోట్లతో క్రమబద్ధీకరణ

13 Nov, 2016 02:48 IST|Sakshi
పాత నోట్లతో క్రమబద్ధీకరణ

ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌:
నిర్మాణాలు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం నోటీసు అందుకున్న వారు చెల్లించాల్సిన సొమ్మును పాత రూ.500, రూ.1000 నోట్ల ద్వారా కూడా చెల్లించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ సీఎస్‌ రాజీవ్‌ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ చంద్ర, ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావులతో సీఎం కేసీఆర్‌ శనివారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేయాల్సిన పనులన్నీ చేయాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములు, అర్బన్ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్సీ) భూముల్లో నిర్మాణాలు, ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ కోసం చేసే చెల్లింపులకు ఈ నెల 14 వరకు పాత పెద్ద నోట్లను కూడా తీసుకోవాలని ఆదేశించారు.

జీవో నంబర్‌ 59తో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు, జీవో నంబర్‌ 92తో యూఎల్సీ ఖాళీ స్థలాలు క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ట్రేజరీలకు కూడా సమాచారం అందించింది. ఆదివారం (13వ తేదీ)న కూడా బ్యాంకులు, ట్రేజరీలు తెరిచి ఉంటాయని, ఆది, సోమవారాల్లో ట్రేజరీల ద్వారా చెల్లింపులకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలని దరఖాస్తుదారులను ప్రభుత్వం కోరింది. చెల్లింపులకు సంబంధించిన చలాన్లను సంబంధిత రెవెన్యూ అధికారులకు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. చలాన్లు అందిన వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు