పునరావాస కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరిస్తాం

19 Mar, 2016 02:31 IST|Sakshi
పునరావాస కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరిస్తాం

జాయింట్ కలెక్టర్  రాంకిషన్
ఇంటికో ఉద్యోగం ఇప్పించండి
సంగంబండ బాధితల మొర

 
మక్తల్: పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరిస్తామని, ఇందుకు అందరూ సహకరించాలని జేసీ రాంకిషన్  సంగం ముంపు బాధితులను కోరారు. శుక్రవారం మండల సమీపంలో చేపడుతున్న పునరావాస కేంద్రమైన కొత్తగార్లపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా నీటి సమస్య వేధిస్తోందని, దీంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. పునరావాసంలో 240 ఇళ్లు మంజూరయ్యాయని, అందులో 79 ఇళ్లు పూర్తి కాగా 64 బేస్‌మెంట్‌లెవల్, 15 ఇళ్లుపైకప్పు వరకు, 46 ఇళ్లు పనులు చేపట్టలేదని అధికారులు నివేదికలను సమర్పించారు. అందులో పది మంది మృతి చెందారని పేర్కొన్నారు. కొందరు శ్మశాన వాటికకు స్థలంలేదని, మరికొందరు తమకు ఇళ్లస్థలాలు చూపలేదని జేసీ దృష్టికి తీసుకొచ్చారు.

 కన్నీటితో దాహం తీర్చుకోవాలా సారూ..
 పునరావాస కేంద్రాన్ని సందర్శించేందుకు వచ్చిన జేసీ రాంకిషన్‌కు హృదయ విదారకర ఘటన ఎదురైంది.  తాగేందుకు గుక్కెడు నీరు లేవు. కన్నీటితో దాహం తీర్చుకోవాలా సారూ...అంటూ బాధితులు మొరపెట్టుకున్నారు. భగభగ మండే ఎండలో దాహం తీర్చుకోడానికి నీళ్లు లేక తాము ఎలా బతకాలి... ఇళ్లు ఎలా నిర్మించుకోవాలని కొందరు ప్రశ్నించారు. నీటి కోసం ఎంత మంది కాళ్లు పట్టుకోవాలి..ఎవరినని అడుక్కోవాలి సారూ...అని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇందుకు చలించిపోయిన ఆయన వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి నాగరాజు పనితీరు గురించి ఆరా తీయగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు.

వెంటనే ఎస్‌ఈకి ఫోన్ చేయగా  విద్యుత్ మోటార్ల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు.  ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకొని ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని కొందరు తెలపగా ప్రస్తుతానికి ఒక మోటారుతో సరిపెట్టుకోవాలని, ఆ తరువాత శాశ్వత పరిష్కారానికి చర్యలు తీ సుకుంటామన్నారు.  పదైదు రోజుల కోసారి వచ్చి పరిశీలిస్తానని భరోసా ఇచ్చారు.

 గార్లపల్లిని ఖాళీ చేయాలి
 ఆ తరువాత సంగంబండ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన ఊట్కూర్ మండలం గార్లపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. త్వరలో ఖాళీ చేయాలని బాధితులకు తెలపగా నీటి సమస్యను పరిష్కరించేంత వరకు ఖాళీ చేయమని స్పష్టం చేశారు. సర్వం కో ల్పోయామని తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. కొత్తగార్లపల్లిలో రేషన్‌షాపు, అంగన్‌వాడీ తదితర అనేక సమస్య లు ఉన్నాయని జేసీకి తెలపగా అన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట నారాయణపేట్ ఆర్డీఓ వేణుగోపాల్, హౌసింగ్ డీఈ సురేందర్‌గౌడ్, తహసీల్దార్లు అంజిరెడ్డి,   మాదవ్‌రావు, హౌసింగ్ ఏఈలు విజయకుమార్, వీరేష్‌చారి, సతీష్‌కుమార్, నాగరాజు, బాల్‌రాజు, ఆర్‌ఐ భాస్కర్, వీఆర్‌ఓలు నారాయణ, ఆనంద్, మల్లికార్జున, నిర్వాసితులు మల్లేష్‌గౌడ్, శాంతిరెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు