గూడు.. గోడు ఓ బస్సు

28 Mar, 2018 08:01 IST|Sakshi

పునరావాసం కల్పించేందుకు కేశవనగర్, అమీన్‌పూర్‌ తరలింపు

గుడిసెలు నేలమట్టం

ఇంట్లో బట్టలు కుట్టుకోవాల్సిన కుట్టు మెషిన్‌ను బస్సెక్కించారు. ఉన్న చోటును వదల్లేక కన్నీటి పర్యంతమవుతూ కదిలిపోతున్నారు. వీరెవరో కాదు...మాదాపూర్‌ హైటెక్‌ సిటీ సమీపంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వలస కూలీలు. వారంరోజుల క్రితం ఇక్కడ అగ్నిప్రమాదం జరిగి 100 గుడిసెలు కాలిపోయిన నేపథ్యంలో అధికారులు మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా రంగప్రవేశం చేశారు. వారం రోజులుగా ఆ ప్రాంతంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న గుడిసె వాసులను ఖాళీ చేయించి.. బలవంతంగా అక్కడి నుంచి కేశవనగర్‌కుతరలించారు. తమను వేరే చోటికి తరలించడం తగదని వేడుకున్నారు. అయినా తప్పనిసరిపరిస్థితిలో వారిని సామాన్లతో సహా బస్సుల్లోకి ఎక్కించారు.

అప్పుడే తెల్లవారుతోంది.. హైటెక్‌సిటీ సమీపంలో అలజడి.. జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. పోలీసులు చుట్టుముట్టారు.. వలస కూలీల గుడిసెలు నేలకూల్చారు.. బాధితులను ఖాళీ చేయించారు.  పునరావా సం కల్పించేందుకు కేశవనగర్, అమీన్‌పూర్‌కు తరలించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుడిసెలు కూల్చివేయడంపై కూలీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.. చెల్లా చెదురైపోయారు.. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.. 

మాదాపూర్‌: హైటెక్‌సిటీ సమీపం పత్రికా నగర్‌లోని ప్రభుత్వ స్థలంలో వలస కూలీలు నివాసం ఉంటున్నారు. ఇక్కడ వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడంతో దాదాపు వందకుపైగా గుడిసెలు కాలిపోయి కూలీలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు కట్టుకున్న గుడిసెలు కాలిబూడిదై బాధలో ఉండి తాత్కాలికంగా వేసుకున్న గుడిసెల్లోనే కాపురాన్ని ప్రారంభించిన వలస కూలీలు తెల్లవారుజాము నిద్ర నుంచి లేవకముందే గుడిసెల ముందు పోలీసులు, అధికారులను చూసి కలవరపడ్డారు.

ఏం జరుగుతుందో తెలుసు కునే సరికి వారందరినీ ఖాళీ చేయిం చారు. బస్సులు, ఆటోల్లో  కేశవనగర్, అమీన్‌పూర్‌కు తరలించారు.  కొంత మంది తమ వస్తువులను నెత్తిన పెట్టుకొని, చిన్న చిన్న ఆటోలలో వస్తు సామాగ్రిని వేసుకొని బాధితులు వెళ్లిపోయారు.  జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా గుడిసెల చుట్టూ పోలీసులను మోహరించి బలవంతంగా తరలించారని బాధి తులు వాపోయారు. బిక్కు.. బిక్కు మంటూ తమ వస్తువులను చేతపట్టుకొని వాహనాల్లో ఎక్కి కూర్చోవడం అందరినీ కలిచివేసింది. జేసీ బీలతో గుడిసెలను నేలమట్టం చేశారు. 

212 కుటుంబాలకు పునరావాసం..
మాదాపూర్‌ అగ్ని ప్రమాద బాధితుల్లో 212 కుటుంబాలకు పునరావాసం కల్పించామని  జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ మమత తెలిపారు. 148 కుటుంబాలకు కేశవనగర్‌లోని ట్రాన్సిట్‌ గృహాల్లో, మరో 64 కుటుంబాలకు అమీన్‌పూర్‌లో ప్రభుత్వ గృహాల్లో పునరావాసం కల్పించామని చెప్పారు. మాదాపూర్‌లోని పత్రికానగర్‌ నుంచి ప్రత్యేక వాహనాల్లో బాధిత కుటుంబాలను కేశవనగర్, అమీన్‌పూర్‌లకు తరలించామన్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని డీసీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు