తిరస్కరిస్తే.. మళ్లీ దరఖాస్తు చేసుకోండి

8 Dec, 2014 01:41 IST|Sakshi
తిరస్కరిస్తే.. మళ్లీ దరఖాస్తు చేసుకోండి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు: మంత్రి హరీశ్‌రావు

 దుబ్బాక: సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హులైనప్పటికీ తిరస్కరణకు గురైతే తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో మళ్లీ  దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా దుబ్బాక, చిన్నకోడూరుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. అందువల్లే లబ్ధిదారుల సంఖ్యకు పరిమితి విధించలేదన్నారు. అర్హులు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, గడువంటూ ఏమీ లేదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర సర్వేలో 2.50 లక్షల మంది వికలాంగులు, వృద్ధులు, వితంతువులు పింఛన్‌లకు అర్హులుగా గురించామన్నారు. ఈ నెల 10 నుంచి 15వ తేదీలోగా పెంచిన పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. ఇక వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. అందులో భాగంగానే త్వరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు వసతి గృహాల్లో రాత్రిబస చేయనున్నట్లు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు