గుర్తుకొచ్చిన అనుబంధం

12 Jan, 2015 09:37 IST|Sakshi
గుర్తుకొచ్చిన అనుబంధం

తాను నాటిన మొక్క పెరిగి పెద్దదై అన్నార్తులకు ఫలాలను అందజేస్తుంటే ఎవరికైనా తీయటి అనుభూతినిస్తుంది. ఆ కోవకు చెందినవారే ఎంవీపీసీ శాస్త్రి. సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం తాను వికారాబాద్ మొట్టమొదటి సబ్ కలెక్టర్‌గా పని చేసిన కాలంలో ఆ గ్రామాన్ని సందర్శించారు. అమాయక చెంచుల దీనపరిస్థితిని చూసి చలించిపోయారు. అక్కడి ప్రజలను చైతన్యపర్చాలనే ఉద్దేశంతో గ్రామానికి ‘చైతన్యనగర్’గా నామకరణం చేశారు. సంక్షేమ ఫలాలను అభాగ్యుల చెంతకు చేర్చారు. అనంతరం ఆయన వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లిపోయారు. ఇన్నేళ్ల తర్వాత శాస్త్రికి మళ్లీ ఆ గ్రామం మదిలో మెదిలింది. చెంచులతో అనుబంధం గుర్తుకొచ్చింది. ఆ దీనజనులు ఎలా ఉన్నారో చూడాలనుకున్నారు. ఆదివారం సతీసమేతంగా కారులో హైదరాబాద్ నుంచి పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్‌కు వచ్చారు. కాలనీవాసుల కష్టసుఖాలను తెలుసుకున్నారు. నాటి తీపి గురుతులను నెమరువేసుకున్నారు.
 
 పెద్దేముల్: మండలంలోని రేగొండి పంచాయతీ అనుబంధ గ్రామమైన చైతన్య నగర్ (చెంచునగర్)ను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ మెంబర్ ఎంవీపీసీ శాస్త్రి ఆదివారం సందర్శించారు. దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత చైతన్యనగర్‌కు రావడం విశేషం. ఈ సందర్భంగాచైతన్యనగర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1979-81 ప్రాంతంలో శాస్త్రి వికారాబాద్ మొట్ట మొదటి సబ్ కలెక్టర్‌గా పని చేశారు. అప్పుడు రాష్ట్ర మంత్రిగా మాణిక్‌రావు ఉన్నారు. చైతన్యనగర్‌ను సందర్శించినప్పుడు చెంచులు పడుతున్న బాధలను చూసిన ఆయన మనసు చలించింది. వారి సంక్షేమానికి ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది ఆయనలో. వారి అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో చెంచునగర్‌గా ఉన్న గ్రామానికి ‘చైతన్య నగర్’గా పేరు పెట్టారు.

చెంచుల అభివృద్ధికి కోట్‌పల్లి ప్రాజెక్టు కింద సుమారు 250 ఎకరాల భూమి ఇప్పించారు. ఇళ్లు, పాఠశాల, పాడి గేదెలను ఇప్పించేందుకు కృషి చేశారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించారు. అంతేకాకుండా చెంచుల యువతులకు వివాహాలు కూడా జరిపించారు. తాను పేరు పెట్టిన ఊరు ఎలా ఉందని 30 ఏళ్ల తర్వాత గుర్తు పెట్టుకొని హైదరాబాద్ నుంచి సతీసమేతంగా వచ్చారు. గ్రామంలోకి వచ్చిన శాస్త్రిని మొదటగా ఎవరూ గుర్తించలేదు. తర్వాత తాను శాస్త్రిని అని, అప్పట్లో మీకు ఇళ్లు, భూములు ఇప్పించానని, పెళ్లిళ్లు చేసింది తానేనని అని చెప్పడంతో అక్కడే ఉన్న వృద్ధులు, శాస్త్రి దొర బాగున్నావా అంటూ పాదాభివందనాలు చేశారు. గ్రామస్తులు పెద్ద మొత్తంలో పాఠశాల వద్ద గుమిగూడారు. బాగున్నారా అంటూ శాస్త్రి దంపతులను చెంచులు ఆప్యాయంగా పలకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడున్నర దశాబ్దాల క్రితం చెంచునగర్‌గా ఉన్న ఈ గ్రామానికి తాను చైతన్యనగర్‌గా నామకరణం చేశానని గుర్తు చేసుకున్నారు. గ్రామం ప్రస్తుతం ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఉందో తెలుసుకేనేందుకు వచ్చానని తెలిపారు. పిల్లలను మంచిగా చదివించాలని చెంచులకు సూచించారు. అనంతరం డీలర్ లాలు శాస్త్రి దంపతులకు తేనె సీసాను అందజేశారు.


 అనంతరం ఆయనస్థానిక పాఠశాల ఆవరణలో చెంచులతో కలిసి భోజనం చేశారు. రాత్రి బడిలో పురుషులు చదువుకోవాలని చెప్పారు. ఆయనను కలిసిన వారిలో మాజీ సర్పంచ్‌లు అంజిలయ్య, ప్రకాశం, గ్రామస్తులు తిరుమలయ్య తదితరులున్నారు.
 

మరిన్ని వార్తలు