లాక్‌డౌన్‌ ముగియగానే వేతనాల విడుదల 

1 Apr, 2020 04:25 IST|Sakshi

రిజర్వు ఫండ్‌గానే ఆ మొత్తాన్ని ఉంచుతాం

ఉద్యోగులతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల వేతనాలు తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది.. అదేమీ పూర్తి స్థాయి కోత అని భావించవద్దు.. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించినట్టుగా భావించాలి. అది రిజర్వు ఫండ్‌ కిందే పెడతాం.. ఆపత్కాలంలో ఇబ్బంది ఉండకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నాం. లాక్‌డౌన్‌ ముగియగానే ఆ నిధులను విడుదల చేస్తాం’అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. ఉద్యోగుల వేతనాల్లో కోత విషయంపై ఉద్యోగ సంఘాల జేఏసీ మంగళవారం టీఎన్‌జీవో భవన్‌లో అత్యవసరంగా సమావేశమైంది. జీవో 27 జారీ తర్వాత తలెత్తిన పరిణామాలపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో జేఏసీ చైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ మమత మాట్లాడారు.

కరోనా డ్యూటీ చేస్తున్న ఉద్యోగులను జీవో 27 నుంచి మినహాయించి వారికి పూర్తి వేతనం చెల్లించాలని కోరారు. చాలా తక్కువ స్థాయిలో పింఛను పొందుతున్న పెన్షనర్లకు కోత లేకుండా చెల్లించాలని కోరారు. అలాగే మార్చి నెలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సీఎంతో చర్చించి పరిష్కారం అయ్యేలా చూస్తానని ఈ సందర్భంగా సీఎస్‌ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. జేఏసీ సమావేశంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ, ట్రెస్సా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు