ఆర్టీసీ సమ్మె; కార్మికులకు ఊరట

16 Oct, 2019 12:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. గతనెల వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. సోమవారం నాటికి జీతాలు చెల్లిస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో జీతాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని కోర్టుకు విన్నవించింది. సోమవారం లోపు కార్మికులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్‌ జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాల్చింది. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడంతో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం సూచించింది. ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్‌ జీవో, టీజీవో సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరించింది.

జీతాలిచ్చినా సమ్మె కొనసాగుతుంది
ప్రతి నెలా ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు ఆర్టీసీ యాజమాన్యం కావాలనే తొక్కిపెట్టిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, ఈ దుర్మార్గానికి హైకోర్టు ఫుల్‌స్టాప్‌ పెట్టిందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆర్టీసీపై ప్రభుత్వం వైఖరికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని, నియంతృత్వ పోకడలు మానుకోవాలన్నారు. జీతాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. సమ్మె ప్రభావం లేదని చెబుతున్న యాజమాన్యం జీతాలు ఇవ్వడానికి సిబ్బంది లేరని చెప్పడం విడ్దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు.

మరిన్ని వార్తలు