‘కోమటిరెడ్డి’కి గన్‌మెన్ల  తొలగింపు

27 Mar, 2018 11:59 IST|Sakshi

నోటీసులు జారీ  చేయనున్న జిల్లా పోలీసులు

గన్‌మెన్ల తొలగింపుపై కాంగ్రెస్‌ నాయకుల ఆగ్రహం

కక్షతోనే తొలగించారని, కుట్ర కోణం దాగి ఉందని ఆరోపణలు

బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యను ప్రస్తావిస్తున్న అనుచరులు

సాక్షిప్రతినిధి, నల్లగొండ : మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి గన్‌మెన్లను తొలగించారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులనుంచి జిల్లా పోలీసులకు మూడు రోజుల కిందటే ఈ ఉత్తర్వులు అందాయి. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల మొదటిరోజు గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్‌ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. ఈ సందర్భంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్న టూ ప్లస్‌ టూ గన్‌మెన్‌లను తొలగించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. కాగా, మూడు రోజుల కిందట ఇంటెలిజెన్స్‌ విభాగంనుంచి ఉత్తర్వులు కూడా అందాయని సమాచారం. కాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఈ మేరకు జిల్లా పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. తనను హత్య చేయడానికే గన్‌మెన్లను తొలగించారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గన్‌మెన్ల తొలగింపు ఉత్తర్వులు జిల్లా పోలీసుశాఖకు చేరడం, వారు నోటీసులు జారీ చేయనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   
కుట్రదాగి ఉంది
కోమటిరెడ్డికి గన్‌మెన్లను తొలగించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన అనుచరవర్గం ఆరోపిస్తోంది. ఇటీవల కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త శ్రీనివాస్‌ హత్య జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తనకు ప్రాణభయం ఉందని శ్రీనివాస్‌ గన్‌మెన్లను కేటాయిం చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కాగా శ్రీనివాస్‌కు ఎలాంటి గన్‌మన్లను కేటాయించని నేపథ్యంలోనే ఆయన హత్య జరగడం సంచలనం సృష్టించింది. మంత్రిగా పనిచేసిన ఒక సీనియర్‌ నేతకు గన్‌మెన్లను ఎలా తొలగిస్తారని ఆయన అనుచర వర్గం ప్రశ్నిస్తోంది. పోలీసులు మంగళవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గన్‌మెన్లకు తొలగింపునకు సంబంధించి నోటీసులు జారీ చేస్తామని చెబుతున్నా, వాస్తవానికి సోమవారంనుంచే ఆయన గన్‌మెన్లను తీసేశారని చెబుతున్నారు. ఈ కారణంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఏదైనా హాని తలపెడతారేమోనన్న అనుమానాలను ఆయన అనుచర వర్గం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ పరిణామాల అన్నింటి నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వం ప్రభుత్వ చర్యను ఖండిస్తూ ఆందోళనలు చేపట్టే ఆకాశం ఉంది. మరోవైపు కోమటిరెడ్డి శాసనసభ్యత్వం రద్దుకు సంబంధించి మంగళవారం హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. మరోవైపు ప్రభుత్వం తనకు గన్‌మెన్లను తొలగించడాన్ని కోమటిరెడ్డి సీరియస్‌గానే పరిగణిస్తున్నారని,  ప్రభుత్వం తనపై చేస్తున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న యోచనలో  ఉన్న ట్టు ఆయన అనుచర నేతలు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు