వాళ్లు కేవలం కొంగు కప్పుకొనే తిరుగుతారు

7 Dec, 2019 15:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలని నటి, సామాజిక వేత్త రేణూ దేశాయ్‌ అన్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో మహిళలకు ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ఏదేమైనా వ్యవస్థ, సమాజంలో మార్పు వచ్చినపుడే నిర్భయ, దిశ వంటి ఘటనలు జరగవని అభిప్రాయపడ్డారు. అదే విధంగా అత్యాచార ఘటనలకు మహిళల వస్త్రధారణను కారణంగా చూపడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో శనివారం ఆమె సాక్షితో తన మనోభావాలు పంచుకున్నారు. 

‘ఇంట్లో లక్ష్మీదేవి, సరస్వతిని పూజిస్తారు కానీ చాలా మంది మగవాళ్లు తమ ఇంటి లక్ష్మిని మాత్రం సరిగ్గా చూసుకోరు. ఇందుకు ఎవరూ అతీతం కాదు. దేవుడిపై ఉన్న భయం, భక్తి చట్టాలపై కూడా ఉండాలి. అప్పుడే నేరాలు కాస్తైనా తగ్గుతాయి. ఇక బట్టల వల్లే బలత్కారం అనే వాళ్లని అస్సలు క్షమించకూడదు. వారన్నట్లుగా మరి మూడు నెలల పసివాళ్లు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు. దిశ కూడా సల్వార్‌, దుపట్టా వేసుకునే బయటికి వచ్చారు కదా. చాలా వరకు ట్రైబల్‌ ఏరియాల్లో కొంగు కప్పుకొని మాత్రమే తిరుగుతారు. మరి వాళ్లందరి పట్ల మగవాళ్లు అలా ప్రవర్తించడం లేదు కదా. మహిళల స్వేచ్ఛను హరించవద్దు. బట్టల కారణంగా.. రాత్రి వేళల్లో బయట ఉన్నందు వల్లే అత్యాచారం చేశానంటే కుదరదు. మనకు స్వీయ నియంత్రణ ఉండాలి. ఓ మహిళ మీ ముందు నగ్నంగా ఉన్నా సరే అమ్మలా భావించి ఏమైందమ్మా అని అడిగి మరీ తనకు సాయం చేసే మానసిక పరిపక్వత రావాలి’ అని రేణూ దేశాయ్‌ పేర్కొన్నారు. 

‘ఇక దిశ ఘటనతో ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులకు భయం కలిగింది. నిందితుల పట్ల ఎన్‌హెచ్చార్సీ స్పందించిన తీరు సరైందే. అయితే దిశ మానవ హక్కులకు కూడా భంగం కలిగిన విషయాన్ని గుర్తించాలి కదా. పథకం ప్రకారం ఆమె స్కూటీని పంక్చర్‌ చేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేయడం ఎంత వరకు సమంజసం. కేవలం రూపాన్ని బట్టి మనిషి అనటం సరికాదు. మనిషి రాక్షసుడిగా ప్రవర్తించినపుడు అతడిని జంతువుగానే గుర్తించాలి. రాక్షసుడే అవుతాడు అలాంటి వాళ్లకు మానవ హక్కులు ఎలా వర్తిస్తాయి. పేద, ధనిక, కుల, వర్గ, మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికీ ఒకే న్యాయం ఉండాలి. తప్పు చేసింది ఎవరైనా అందరికీ సమానంగా శిక్షలు పడాలి. అయితే ఆ క్రమంలో నిజమైన దోషులెవరో గుర్తించగలగాలి. 

అంతేకాదు విద్యావిధానంలోనూ మార్పులు రావాలి. సైకాలాజీని పాఠ్యాంశంగా బోధించాలి. ఇక చదువుకునే అవకాశం లేని వాళ్లకు విద్యను అందించుటకై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మనిషి స్వభావంలో మార్పు వచ్చినపుడు, చట్టాల పట్ల భయం కలిగి ఉన్నపుడే మార్పు సాధ్యమవుతుంది. దిశ ఘటన జరిగిన రోజు దేశవ్యాప్తంగా ఎన్నో అత్యాచారాలు జరిగాయి. అయితే ఘటన తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. నిన్నటి ఎన్‌కౌంటర్‌ను నేను పూర్తిగా అంగీకరించను. అలాగని వ్యతిరేకించను. అయితే తెలంగాణ పోలీసుల చర్యకు జనామోదం లభించడం చూస్తుంటే అత్యాచార ఘటన పట్ల వారు స్పందించిన తీరు స్పష్టమవుతోంది. నిజానికి దిశ ఘటనలో ఆ నలుగురే కాదు. ఘటన జరుగుతున్నా ఆ వైపుగా దృష్టి సారించని వాళ్లతో సహా ఈ సమాజం మొత్తం ఆ నేరంలో భాగస్వామ్యమే. ఇక్కడ నేను ఓ ఆడపిల్లకు తల్లిగా మాట్లాడుతున్నాను’ అని చెప్పుకొచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా