గేట్లు.. ఎత్తలేక పాట్లు!

23 Aug, 2018 01:57 IST|Sakshi
కడెం ప్రాజెక్టు గేటుకు మరమ్మతు చేస్తున్న సిబ్బంది

గాల్లో దీపంలా సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ 

వరదలొస్తే గేట్లు ఎత్తడంలో తత్తరపాటు 

కడెం, సాత్నాల గేట్ల నిర్వహణలో బయటపడ్డ నిర్లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో నీటిపారుదల శాఖ అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాజెక్టులు, వాటి పరిధిలోని డ్యాముల భద్రత, గేట్ల నిర్వహణ, పరికరాల కూర్పు, సిబ్బంది అవసరాలపై పూర్తి అంచనా వేయలేకపోతోంది. ఆ దిశగా చర్యలు లేకపోవడం పెనుముప్పు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. వర్షాలకు ముందే ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ, సిబ్బంది నియామకాలపై శ్రద్ధ చూపకపోవడం ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు, అంచనాలకు మించి వరద రావడంతో సాత్నాల, కడెం ప్రాజెక్టుల గేట్ల నిర్వహణలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. 

పట్టింపులేని ధోరణి.. 
కృష్ణా బేసిన్‌లో 2009లో శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 25 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద రాగా, గోదావరి బేసిన్‌లో 1983లో శ్రీరాంసాగర్‌ పరిధిలో 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు కేంద్ర జల సంఘం రికార్డులు చెబుతున్నాయి. 2009లోనే నాగార్జునసాగర్‌ గరిష్ట వరద 14.5 లక్షల క్యూసెక్కుల వరకు ఉండగా, జూరాలకు 11.14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. శ్రీశైలం వరదను ఎదుర్కొనే ముం దస్తు సన్నద్ధతలో విఫలం కావడంతో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. రెండేళ్ల కింద ఏడాది సెప్టెంబర్‌లో ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు తక్కువ సమయంలో ఎక్కువ వరదొచ్చింది. వీటి నిర్వహణ నీటి పారుదల శాఖకు కత్తిమీద సాములా మారింది. 2016 సెప్టెంబర్‌లో సింగూరులో 20 రోజుల్లోనే 75 టీఎంసీల మేర వరద వచ్చింది.

ఈ సమయంలో సింగూరు గేట్లు తెరుచుకోక నానా తంటాలు పడాల్సి వచ్చింది. ప్రాజెక్టు ప్రొటోకాల్‌ ప్రకారం మధ్య గేట్లు మొదట తెరవాల్సి ఉండగా, అవి తెరుచుకోలేదు. దీంతో ఇతర గేట్లను తెరిచి నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. ఇందుకు ప్రాజెక్టు గేట్ల ఆపరేషన్, మెయింటెనెన్స్‌ను గాలికొదిలేయడం, రోప్‌ వైర్ల నిర్వహణ పట్టకపోవడమే కారణమని తేల్చారు. తాజాగా కడెంలోనూ అదే జరిగింది. ఈ నెల 16న కడెం ప్రాజెక్టు రెండో నంబర్‌ గేట్‌ కౌంటర్‌ వెయిట్‌ తెగిపోయిన కారణంగా నీటి ఒత్తిడికి పక్కకు ఒరిగి కిందకి దిగని పరిస్థితి తలెత్తింది. దీంతో గేటు వేయడం సాధ్యంకాక 5 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోయింది. ప్రాజెక్టు చీఫ్‌ఇంజనీర్‌ శంకర్‌ ఆధ్వర్యంలో ఇంజనీర్లు రెండ్రోజులు శ్రమించి గేటును కిందకి దించగలిగారు. సాత్నాల పరిధిలోనూ మూడు రోజుల కిందట 45 వేల క్యూసె క్కుల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులోకి 90 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇదే సమయంలో కరెంట్‌ పోవడం, జనరేటర్‌పై పిడుగు పడటంతో గేట్లు తెరవడంలో అయోమయం నెలకొంది. గేట్లు ఎత్తే ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తుల సాయంతో గేట్లు ఎత్తాల్సివచ్చింది. 

సిబ్బంది లేమి..
రాష్ట్రంలోని చాలా ప్రాజెక్టుల పరిధిలో ఓఅండ్‌ఎంకు సరిపడనంతగా లేదని సిబ్బంది కొరతే శాఖకు పెద్ద సమస్యగా మారింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిధిలో లష్కర్‌లు, వర్క్‌ఇన్‌స్పెక్టర్, గేటు ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్‌మెన్, పంప్, జనరేటర్‌ ఆపరేటర్లు కలిపి  5,674 మంది సిబ్బంది అవసరం ఉంది. ఇందు లో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 1,058, లష్కర్‌లు 3,671, ఎలక్ట్రీషియన్లు 107, గేట్ల ఆపరేటర్లు 169, జనరేటర్‌ ఆపరేటర్లు 52 మంది అవసరం ఉం దని తేల్చింది. ప్రస్తుతం 1700 మందే ఉన్నారు. లష్కర్‌లు 1450 మందే ఉండగా, పంప్‌ ఆపరే టర్లు 180 మంది ఉన్నారు. జూరాల ప్రాజెక్టు పరిధిలో ఒక్కరే ఎలక్ట్రీషియన్‌ ఉండగా, ఆపరేటర్ల కొరతతో కాల్వల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందిని డ్యామ్‌ సేవలకు వినియోగిస్తున్నా రు. అక్కడ పూర్తి స్థాయి సిబ్బందిని సమకూర్చడంపై గతేడాదిలోనే ప్రతిపాదన వచ్చినా నీటిపారుదల శాఖ అమలు చేయలేకపోయింది. సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఒక హెల్పర్, ఇద్దరు వాచ్‌మెన్‌లతో నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది వర్షాల సమయానికి ముందే గత పరిస్థితులు తలెత్తకుండా నీటిపారుదల శాఖ ముందుగానే మేల్కోవాల్సి ఉందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు