బస్సు బాగుంది.. గడప దాటనంది!

6 Oct, 2018 03:11 IST|Sakshi

నెల దాటినా రోడ్డెక్కని ఎలక్ట్రిక్‌ బస్సులు

ఇక్కడ పచ్చగా మెరిసిపోతున్నవి ఎలక్ట్రిక్‌ బస్సులు. ఇవి ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల చేయవు. అంటే.. పర్యావరణానికి చాలా మంచివని అర్థం.. నగరంలో పెరుగుతున్న కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు.. మరింత మెరుగైన ప్రయాణం కోసం వీటిని తెచ్చారు.. నెల క్రితం ఫొటోలు గట్రా తీసి ఎంతో ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేశారు.. ఫొటోలైతే తీశారు గానీ.. బస్సులను మాత్రం ఇప్పటివరకూ రోడ్డు మీదకు తీయలేదు.. నెల దాటినా.. అవిప్పటికీ గడప దాటలేదు.. ఇంతకీ ఈ బస్సెందుకు కదలడం లేదు? కనుక్కుందాం..     – సాక్షి, హైదరాబాద్‌

సమస్య ఏమిటి..?
పర్యావరణానికి అనుకూలమైన ఈ బస్సులకు విద్యుత్తే ఇంధనం. 21 సీట్ల సామర్థ్యం గల ఈ–బస్సులు లిథియం అయాన్‌ బ్యాటరీలతో నడుస్తాయి. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే దాదాపు 250 కి.మీ.లు తిరుగుతాయి. ఒక్కో బ్యాటరీ చార్జింగ్‌కు 4 గంటల సమయం పడుతుంది. ఇందుకోసం నగరంలో రూ.2 కోట్ల వ్యయంతో రెండు చోట్ల చార్జింగ్‌ స్టేషన్లు పెట్టాలని నిర్ణయించారు. అందులో ఒకదాన్ని మియాపూర్‌ డిపోలో.. మరొకదాన్ని  పికెట్‌లో ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటులో జాప్యమే ఎలక్ట్రిక్‌ బస్సుల ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.  

అధికారులు ఏమంటున్నారు?
టీఎస్‌ఆర్టీసీకి మొత్తం 100 బస్సులు రావాలి. వీటిలో తొలివిడతలో 40 మంజూరవ్వాలి. ఐదే వచ్చాయి. చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు కాకపోవడంతో ఇంకా రోడ్డెక్కలేదు. మరో 10 రోజుల్లో బస్సులు అందుబాటులోకి వస్తాయి.   –రవీందర్, ఆర్టీసీ ఈడీ (ఇంజనీరింగ్‌)

మరిన్ని వార్తలు