తెలుగులోకి పలు కమిషన్ల నివేదికలు

12 Jan, 2019 01:08 IST|Sakshi
శుక్రవారం రాజ్‌భవన్‌లో కమిషన్ల నివేదికలను గవర్నర్‌ నరసింహన్‌కు అందజేస్తున్న బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు. చిత్రంలో కమిషన్‌ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఆంజనేయులుగౌడ్, జూలూరు గౌరీశంకర్, సభ్యకార్యదర్శి అనితా రాజేంద్రన్, ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌ తదితరులు

బీసీ కమిషన్‌ను అభినందించిన గవర్నర్‌ నరసింహన్‌ 

మండల్, అనంతరామన్, హవనూర్‌ కమిషన్‌ నివేదికలకు తెలుగు అనువాదం

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశ సామాజిక నేపథ్యం, ప్రజలకు రిజర్వేషన్ల ఆవశ్యకతకు గల ప్రామాణికమైన మండల్, అనంతరామన్, హవనూర్‌ కమిషన్‌ నివేదికలను తెలుగులోకి తీసుకువచ్చి బీసీ కమిషన్‌ గొప్ప పని చేసిందని గవర్నర్‌ నరసింహన్‌ అభినందించారు. దేశంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు మూలాధారంగా నిలిచిన ఈ నివేదికలను దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ భాషలోకి తీసుకురావడం గొప్ప ప్రయత్నమన్నారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో తెలంగాణ బీసీ కమిషన్‌ తెలుగులోకి అనువదించి, ప్రచురించిన మండల్‌ కమిషన్, హవనూర్, అనంతరామన్, ఇంగ్లిష్‌లో ప్రచురించిన ‘బీసీ నోట్‌బుక్‌ ’గ్రంథాల తొలిప్రతులను గవర్నర్‌కు అందజేసింది.

ఈ సందర్భంగా బీసీ కమిషన్‌తో పలు అంశాలపై గవర్నర్‌ చర్చించారు. గవర్నర్‌తో బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, ఆంజనేయలుగౌడ్, జూలూరు గౌరీశంకర్, సభ్యకార్యదర్శి అనితా రాజేంద్రన్‌లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గత సంవత్సర కాలంగా దేశంలోని ఆయా రాష్ట్రాలకు చెందిన బీసీ కమిషన్ల నివేదికలను, తెలంగాణ బీసీ కమిషన్‌ క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని వారు వివరించారు. అనంతరం ఇలాంటి కార్యాచరణను మున్ముందు కూడా కొనసాగించాలని గవర్నర్‌ కమిషన్‌ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు