చిన్నారి.. చేతన

5 Jul, 2018 03:10 IST|Sakshi
చిన్నారి తల్లితో మాట్లాడుతున్న పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌. చిత్రంలో ఏసీపీ చేతన

శిశువుకు సుల్తాన్‌బజార్‌ ఏసీపీ చేతన పేరు పెడతానన్న తల్లి

కుటుంబాన్ని కలసి ధైర్యం చెప్పిన కొత్వాల్‌ అంజనీకుమార్‌

కిడ్నాపర్‌ కోసం బీదర్‌లో టాస్క్‌ఫోర్స్‌ గాలింపు

అంతకు ముందే ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకెళ్లజూసిన నిందితురాలు

సాక్షి, హైదరాబాద్‌: సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రి నుంచి కిడ్నాపైన తన బిడ్డను తిరిగి తన ఒడికి చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఏసీపీ చేతన పేరునే ఆ చిన్నారికి పెడుతున్నట్లు తల్లి సబావత్‌ విజయ ప్రకటించారు. తమకు దైర్యం చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఈ విషయం తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ చిన్నారిని సైతం చేతన లాంటి అధికారిగా చేయాలని విజయ నుంచి మాట తీసుకున్నారు. బాలికల విద్యాశాతాన్ని పెంచడానికి ఇదో ఉత్తమ కేస్‌స్టడీగా మారాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లిన అంజనీకుమార్‌ శిశువు తల్లికి పుష్పగుచ్ఛం అందించారు.  

బీదర్‌కు చెందిన మహిళగానే అనుమానం...
చిన్నారిని కిడ్నాప్‌ చేసిన మహిళ బీదర్‌వాసి అని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువును తీసుకొని ఎంజీబీఎస్‌ నుంచి బస్సులో వెళ్లిన ఆమె బీదర్‌ బస్టాండ్‌లో కాకుండా కాస్త ముందున్న నయాకమాన్‌ స్టాప్‌లో దిగింది. ఇలా కేవలం స్థానికులు మాత్రమే చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. సోమవారం సైతం విజయ బిడ్డ కంటే ముందు మరో ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించి విఫలమైనట్లు బయటపడింది. మీడియాలో హడావుడి, పోలీసుల గాలింపు నేపథ్యంలో భయపడిపోయి బుధవారం సాయంత్రం బీదర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును వదిలివెళ్లింది.

పోలీసులు బీదర్‌లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్‌నకు గురైన సోమవారంరాత్రి డ్యూటీ అధికారిణిగా ఏసీపీ చేతన ఉన్నారు. దీంతో కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయానికి ఆపరేషన్‌ బీదర్‌కు మారడంతో డీసీపీ ఎం.రమేశ్‌ అనుమతి తీసుకుని అక్కడకు వెళ్లి పర్యవేక్షించారు. సుల్తాన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శివశంకర్‌రావు తన డ్రైవర్‌ను ఇచ్చి బీదర్‌కు అంబులెన్స్‌ పంపారు. ఏసీపీ చేతన గురువారం తెల్లవారుజామున చిన్నారిని తీసుకువచ్చి తల్లిఒడికి చేర్చారు.  

త్వరలో భద్రతాచర్యలకు సిఫారసులు..
ఆస్పత్రులు తీసుకోవాల్సిన భద్రతాచర్యల్ని నిర్దేశించడానికి అధ్యయనం చేస్తున్నట్లు కొత్వాల్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఎం.రమేశ్, సుల్తాన్‌బజార్‌ ఏసీపీ డాక్టర్‌ చేతన వీటిపై రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. చిన్నారికి తన పేరు పెట్టడం ఆనందంగా, గర్వంగా ఉందని చేతన అన్నారు. చిన్నారికి కామెర్ల లక్షణాలు కనిపించాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం నీలోఫర్‌ ఆస్పత్రికి తరలిస్తామంటూ కుటుం బీకులు వైద్యుల్ని కోరినా కమిషనర్‌ వస్తున్నారంటూ వారు తరలించడానికి అంగీకరించలేదు. దీంతో చిన్నారి తండ్రి నారీ బయటకు వచ్చి పోలీసులతో పాటు మీడియాపై అసహనం ప్రదర్శిస్తూ చిన్నారి విషయం చెప్పారు. దీంతో స్పందించిన ఆస్పత్రి వర్గాలు చిన్నారిని బంధువుల సంరక్షణలో అంబులెన్స్‌లో నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు.  
 

మరిన్ని వార్తలు