కులాల గణన తర్వాతే రిజర్వేషన్‌ అమలు

17 Dec, 2018 03:35 IST|Sakshi

 సీఎం, పీఆర్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శికి దాసోజు శ్రవణ్‌ లేఖలు

 హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీ కులాల గణన జరపాలి

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాల గణన తర్వాతే రిజర్వేషన్లను అమలు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, పంచాయతీ రాజ్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శిలకు లేఖలు రాశారు. బీసీ రిజర్వేషన్లను వర్గీకరించి దాని ప్రకారమే పంచాయతీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం 52% బీసీలు ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 22 లక్షల ఓట్లను తొలగించి క్షమాపణ చెప్పిన ఎన్నికల సంఘం జాబితా ఆధారంగా కులగణన చేపడితే సహించబోమన్నారు. బీసీఉపకులాల వెనుకబాటుతనం ఆధారంగానే కులగణన చేపట్టాలని గతంలో ప్రభుత్వాన్ని కోరితే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతోనే తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారమే కులాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేసి శాస్త్రీయ విధానం ద్వారా బీసీకులాల గణన జరగాలని కోరారు. 

ఆదేశాలు బేఖాతర్‌
సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేయడం లేదని, హైకోర్టు ఉత్తర్వులను కేసీఆర్‌ ప్రభుత్వం బేఖాతర్‌ చేస్తోందని శ్రవణ్‌ ఆరోపించారు. హైకోర్టు తీర్పు గత జూన్‌ నెలలోనే ఇచ్చినప్పటికీ బీసీకులాల వెనుకబాటుతనానికి కారణాలు కనుక్కోకుండా ముందస్తు ఎన్నికల హడావుడిలో మునిగిపోయిందన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బీసీకులాలగణనను తూతూ మంత్రంగా చేపడుతున్నారని ఆరోపించారు. రెండోసారి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ బీసీలకు తగిన న్యాయం చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు