హాస్టల్‌ నుంచి ఇంటికి తీసుకొచ్చిన రోజే..

23 Aug, 2019 12:10 IST|Sakshi
ఆందోళన చేస్తున్న బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఇన్‌సెట్‌లో మృతి చెందిన బాలుడు

సాక్షి, లక్సెట్టిపేట(మంచిర్యాల): అనారోగ్యంతో బాధపడుతూ లక్సెట్టిపేట ప్రభుత్వ గిరిజన బాలుర వసతిగృహంలో ఉంటూ 9వ తరగతి చదువుతున్న పెండ్రెం శివశంకర్‌(16) మృతిచెందాడు. విద్యార్థి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్‌ మండలం కార్సాలగుట్ట గ్రామానికి చెందిన పెండ్రెం చిత్రు– లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు శివశంకర్‌ లక్సెట్టిపేట ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. జూన్‌ 13న పాఠశాలకు వచ్చాడు. గత వారం రోజుల నుంచి అనార్యోగానికి గురికావడంతో ఈనెల 19న వసతిగృహ ఏఎన్‌ఎం మందాకిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి మందులు ఇచ్చింది.

అయినా తగ్గకపోవడంతో బాలుడి తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో ఈనెల 21న విద్యార్థి తండ్రి చిత్రు వసతిగృహానికి వచ్చి వార్డెన్‌కు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. గురువారం ఆసుపత్రికి తీసుకెళదామని అనుకుంటున్న తరుణంలోనే తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై శివశంకర్‌ మృతి చెందాడు. ఏకైక కుమారుడు ఇలా మృతిచెందడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఘటనపై వార్డెన్‌ శ్రీనివాస్‌ను వివరణ కోరగా విద్యార్థికి జ్వరం రావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించామని తెలిపారు. తాను సమావేశానికి వెళ్లిన సమయంలో విద్యార్థి తండ్రి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడని వెల్లడించారు.

విద్యార్థి సంఘాల ఆందోళన.. 
శివశంకర్‌ మృతిచెందిన విషయం తెలుసుకున్న ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు ఆందోళన చేపట్టారు. సంఘం జిల్లా ఇన్‌చార్జి అడె జంగు, అధ్యక్షుడు వెడ్మ కిషన్, మండల అధ్యక్షుడు పెంద్రం హన్మంతు మాట్లాడుతూ మూడు రోజులుగా జ్వరం వస్తున్నా వార్డెన్, హెచ్‌ఎం, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే శివశంకర్‌ మృతిచెందాడని ఆరోపించారు. శివశంకర్‌ మృతి విషయంపై ఏటీడీవో, డీటీడీవో, వార్డెన్, హెచ్‌ఎంకు సమాచారం ఇచ్చినా వారు స్పందించకపోవడం దారుణమన్నారు. విద్యార్థి మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.
ఆందోళన చేస్తున్న బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు     

మరిన్ని వార్తలు