కన్న కొడుకుల కర్కశత్వం

20 Aug, 2017 10:48 IST|Sakshi
కన్న కొడుకుల కర్కశత్వం
► తల్లిని చేరదీయని తనయులు
► ఆరెకరాల భూమున్నా అనాథలా ‘అవ్వ’
► ఆర్నెల్లుగా నరకయాతన
 
పెద్దపల్లిరూరల్‌:  పున్నాగనరకం నుంచి తప్పించేవాడు కొడుకు.. కానీ.. ఈ అవ్వకు మాత్రం బతికుండగానే నరకం చూపిస్తున్నారు ఆమె కొడుకులు. నవమాసాలు మోసి.. కని.. అల్లారుముద్దుగా పెంచినా.. మలిదశలో ఆమెపై కనికరం చూపడం లేదు. కన్నతల్లి భారమైందో..? ఏమో..? గానీ.. ఆ తల్లిని అనాథను చేసి బస్టాండ్‌లో వదిలేశారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాకేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంటకు చెందిన ఈదునూరి హన్మమ్మ, రాజపోచయ్యకు ఐదుగురూ కుమారులే. వీరిలో అంజయ్య, బాలయ్య, మల్లేశ్‌ చనిపోయారు. మిగిలినవారిలో పెద్దకుమారుడు రవి చొప్పదండిలో ఉంటూ.. కూలీ చేసుకుంటున్నాడు. మరో కుమారుడు కిష్టయ్య హైదరాబాద్‌లో విద్యుత్‌శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

హన్మమ్మ పేరిట తుర్కలమద్దికుంటలో సొంత ఇంటితోపాటు ఆరెకరాల భూమి ఉంది. ఆమె మనవలు రమేశ్, అంకూస్, రంజిత్, సాగర్‌ కొత్తగా ఇంటిని నిర్మిస్తామంటూ ఉన్నదాన్ని కూల్చివేశారు. అప్పటినుంచి ఆమెను కష్టాలు వెంటాడుతున్నాయి. పెద్దపల్లిలో ఉండే మనవలు, బంధువుల వద్దకు వచ్చినా.. ఆదరించలేదు. పైగా ఆమెకు వస్తున్న పింఛన్‌ను మాత్రం నెలనెలా తీసుకునేవారు. కొన్నిరోజులు పట్టణంలోనే యాచిస్తూ పొట్టపోసుకున్న ఈ అవ్వ.. అనారోగ్యంబారిన పడడంతో మనవడు సాగర్‌ రెండునెలలు పోషించి.. రెండురోజుల క్రితమే హైదరాబాద్‌లోని కిష్టయ్య ఇంటివద్ద వదిలివచ్చాడు. ఆ మరుసటిరోజు ఉదయమే.. హన్మమ్మను తుర్కలమద్దికుంటలోని పోచమ్మ గుడివద్ద దించి వెళ్లారని గ్రామస్తులు అంటున్నారు.

ఇదే విషయాన్ని పెద్దపల్లిలో ఉంటున్న మనవలు, బంధువులకు సమాచారం అందించినా వారు స్పందించలేదు. గ్రామ పోలీస్‌ «అధికారికి చెప్పి ఆశ్రయం కల్పించాలని కోరినా నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఓ వైపు వర్షం.. మరోవైపు చలితో గజగజ వణుకుతున్న అవ్వ.. చేసేదేమీ లేక ఆమెను స్థానికులు శనివారం రాత్రి పెద్దపల్లి బస్టాండ్‌కు తీసుకొచ్చారు. ‘సాక్షి’కి సమాచారం అందించగా.. స్థానికులతో కలిసి ఓ దుప్పటి అందించి.. ఆమెకు భోజనాన్ని సమకూర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. కన్నతల్లిని కాదనుకుని.. ఇంత నిర్లక్ష్యంగా వదిలేసినా.. ఆ కొడుకులపై మాత్రం ఎలాంటి ద్వేషం చూపకుండా ఆ అవ్వ మాట్లాడడం అక్కడున్న వారిని కలచివేసింది. 
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా