పనితీరు బట్టే ఫలితాలు: కేటీఆర్

17 Feb, 2016 03:57 IST|Sakshi
పనితీరు బట్టే ఫలితాలు: కేటీఆర్

హన్మకొండ: వరుస విజయాలతో టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్,  ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధిస్తున్నామని, ప్రభుత్వ పనితీరును బట్టే ఫలితాలు వస్తాయని అన్నారు. వరంగల్‌లో మంగళవారం జరిగిన టీఆర్‌ఎస్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, కంటోన్మెంట్, వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ భారీ మెజారిటీ విజయం సాధించిందని వివరించారు.

టీడీపీ అంటే తెలంగాణలో డిపాజిట్ రాని పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీ సైతం ఉనికి కోల్పోయాయని అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన  బాగున్నందునే ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏ రాష్ట్రంలో పోటీ చేసినా ఓటమి పాలవుతోందని ఎద్దేవా చేశారు. వరంగల్ కార్పొరేషన్‌లో టికెట్ల కేటారుుంపు, ఎన్నికల ప్రచారానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో 9 మందితో కమిటీ వేసినట్లు తెలిపారు.  ఏప్రిల్‌లో పార్టీ వార్షికోత్సవ సభలోపు వాటిపై నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆశావహులందరూ సహనం, ఓపికతో ఉండాలని సూచించారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ వెంటే ఉందని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు కేసీఆర్‌కు నీరాజనం పడుతున్నారని, ఆయన కూడా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారని అన్నారు.

మరిన్ని వార్తలు