పరిశోధన ఫలితాలు క్షేత్రాలకు రావాలి

4 Sep, 2015 02:02 IST|Sakshi
పరిశోధన ఫలితాలు క్షేత్రాలకు రావాలి

వ్యవసాయ శాస్త్రవేత్తలకు మంత్రి పోచారం సూచన
ఘనంగా వ్యవసాయ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం
సుగుణాకర్‌రెడ్డికి జీవనసాఫల్య పురస్కారం ప్రదానం

 
హైదరాబాద్: వ్యవసాయం లాభసాటిగా మారేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగం పటిష్టంగా మారితేనే తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, తద్వారా ఆత్మహత్యలు తగ్గుతాయని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిశోధన ఫలితాలు ప్రయోగశాలల నుంచి క్షేత్రాలకు చేర్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి వ్యవస్థాపక దినోత్సవం గురువారం వర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ ఎం.సుగుణాకర్‌రెడ్డికి మంత్రి పోచారం జీవన సాఫల్య పురస్కారాన్ని, నగదు బహుమతిని ప్రదానం చేసి సత్కరించారు. వర్సిటీలో సుదీర్ఘకాలం పాటు అనేక హోదాల్లో పని చేసిన సుగుణాకర్‌రెడ్డి వ్యవసాయ రంగానికి అనేక సేవలందించారని కొనియాడారు. ఆయన విశ్వవిద్యాలయం డీన్‌గా, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా, అసోసియేట్ డెరైక్టర్‌గా పని చేశారు.

హరిత విప్లవం తర్వాత దేశంలో పలు పంటల్లో ఉత్పాదకత పెరిగిందని, 1994-2004 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధిరేటు 2 శాతంగా ఉంటే, ఆ తర్వాత అది 4 శాతాన్ని మించిందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ కులపతి ప్రొఫెసర్ సీహెచ్ హన్మంతరావు చెప్పారు. తెలంగాణ రైతుల ఆర్థిక, సామాజిక పరిస్థితులకనుగుణంగా క్రాపింగ్, ఫార్మింగ్ సిస్టమ్స్ అభివృద్ధి చెందాలని అభిలషించారు. మిషన్ కాకతీయ వల్ల సాగునీటి వనరుల సమర్థ వినియోగానికి అవకాశం కలుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి మాట్లాడుతూ, జీవసాంకేతిక పరిజ్ఞానం వల్ల రెండో హరితవిప్లవం సాధ్యమవుతుందని చెప్పారు. ఏడాది కాలంలో యూనివర్సిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వర్సిటీ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రవీణ్‌రావు వివరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు, డీన్లు, డెరైక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు