రెండున్నరేళ్లు మానసిక వేదనకు గురయ్యా!

10 Feb, 2020 09:12 IST|Sakshi
మాట్లాడుతున్న భూమయ్య

తుపాకులు పోతే కేసు పెట్టకుండా దుష్ప్రచారం

కాల్పులు జరగకపోతే పదేళ్లయినా నాపై ఆరోపణలుండేవి

రిటైర్డ్‌ సీఐ భూమయ్య

సాక్షి, కరీంనగర్‌ : హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో తాను పనిచేసి, బదిలీ అయిన తర్వాత రెండు తుపాకులు పోతే కేసు పెట్టి, దర్యాప్తు చేయకుండా వాటిని గన్‌మెన్‌తో కలిసి తానే తీసుకెళ్లినట్లు దుష్ప్రచారం చేయడంతో రెండున్నరేళ్లు మానసిక వేదనకు గురయ్యానని రిటైర్డ్‌ సీఐ దాసరి భూమయ్య తెలిపారు. ముకరంపురలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్క బుల్లెట్‌ పోతేనే ఎంతో సీరియస్‌గా వ్యవహరించే పోలీసు ఉన్నతాధికారులు, రెండు తుపాకులు పోతే ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు.

తుపాకులు పోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా అప్పటి సీపీ శివకుమార్‌ నాపై ఉన్న కోపంతో టెక్నికల్‌గా కేసు పెట్టారని ఆరోపించారు. వ్యక్తిగత కక్షకు పోకుండా కేసు దర్యాప్తు చేసి ఉంటే తుపాకులు ఏనాడో దొరికేవన్నారు. తుపాకులు పోయిన ఘటనకు అప్పటి ఎస్‌హెచ్‌వోనే పూర్తి బాధ్యుడని పేర్కొన్నారు. సదానందం కాల్పులు జరపకపోయి ఉంటే ఇంకా పదేళ్లయినా తుపాకులు తీసుకెళ్లిన ఆరోపణల్ని ఎదుర్కొనేవాడినని చెప్పారు.

ఇప్పటికైనా పూర్తిస్థాయి విచారణ చేపట్టి, నిజాలు తేటతెల్లం చేయాలన్నారు. కాల్పులు జరిపిన సదానందానికి అతని భార్యతో గొడవలుండేవని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రతీసారి తుపాకులు కావాలని అడుగుతున్నట్లు ఠాణా సిబ్బంది నాతో చెప్పేవారన్నారు. ఈ కేసులో దర్యాప్తు ఆఫీసర్లుగా ఉన్న సీపీ జోయల్‌డేవిస్, ఏసీపీ పరమేశ్వర్‌లు మంచి ఆఫీసర్లని త్వరలోనే వారి విచారణలో నిజాలు తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు