పళ్లు క్లీన్‌ చేయించుకునేందుకు వెళితే..

15 Jan, 2019 11:32 IST|Sakshi

ప్రముఖ ఆస్పత్రిపై రాష్ట్రపతికి ఫిర్యాదు

కేసు నమోదు చేసిన రాంగోపాల్‌పేట్‌ పోలీసులు

రాంగోపాల్‌పేట్‌: డెంటల్‌ క్లీనింగ్‌ కోసమంటూ ఆస్పత్రికి వెళ్లిన ఓ రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగికి కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు అనవసర వైద్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చారు. ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం కారణంగా తాను తీవ్ర మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నానని బాధితుడు ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో రాంగోపాల్‌పేట్‌ పోలీసులు ఆస్పత్రిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి బంజారాహిల్స్‌కు చెందిన పాండురంగారావు (71) రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. 2017 సెప్టెంబర్‌ 4న అతను డెంటల్‌ క్లీనింగ్‌ కోసం సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్‌ కాస్మోటిక్‌ డెంటల్‌ సర్జన్‌ డాక్టర్‌ ప్రత్యూష, డాక్టర్‌ ప్రసాద్, డాక్టర్‌ బింధులను అతడిని పరీక్షించారు. ఆయన దంతాలకు శాశ్వత చికిత్స చేసుకోకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ తరహా వైద్యం సినిమా నటులు, రాజకీయ నాయకులు, వీఐపీలకు అందించినట్లు తెలిపారు. తనకు తండ్రిలాంటి వారని ఒక బిడ్డ సలహా ఇస్తుదని భావించి వైద్యం చేయించుకోవాలని డాక్టర్‌ ప్రత్యూష చెప్పడంతో ఆమె మాటలు నమ్మిం అందుకు అంగీకరించినట్లు తెలిపారు.

అంతకు ముందే ఆయన దంతాలు పూర్తి పటిష్టంగా ఉన్నప్పటికీ 2017, సెప్టెంబర్‌  15న ఆయన 32 దంతాలకు వైద్యం చేసి క్యాప్స్‌ అమర్చారు. ఇందుకుగాను అతను రూ.5లక్షల రూపాయలు చెల్లించాడు. చికిత్స పూర్తయిన 6 నెలలకు తనకు కొత్త సమస్యలు మొదలయ్యాయని, అన్నం, రోటీతో పాటు గట్టి పదార్థాలు తినేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. నోట్లో ఉండే కణాలు దెబ్బతినడంతో రుచి తెలియడం లేదని, 5కేజీల బరువు తగ్గాడు.  30 ఏళ్లుగా రోజూ 6కిమీ వాకింగ్‌ చేసే ఆయన పూర్తిగా బెడ్‌కు పరిమితమయ్యాడు. దీంతో అతను మరోసారి కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్‌ ప్రత్యూష ఆయనను కిమ్స్‌ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ సేతుబాబు దగ్గరకు తీసుకుని వెళ్లింది. 23 మార్చి 2018 నుంచి 27 మార్చి 2018 వరకు ఆయనకు ఆల్ట్రాసౌండ్‌ అబ్డామినల్‌ పరీక్షలు, అప్పర్‌ జీఐ ఎండోస్కోపి తదితర పరీక్షలు నిర్వహించి ఏమీ లేదని తేల్చారు. ఆ తర్వాత కొన్ని మందులు ఇచ్చినా ఫలితం లేదు. దీంతో పాండురంగారావు భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రితో పాటు డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కిమ్స్‌ ఆస్పత్రి యాజమాన్యం, తనకు చికిత్స చేసిన వైద్యులపై ఫిర్యాదు చేశారు. ఇదే ఫిర్యాదును రాష్ట్రపతి, ప్రధాన మంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నుంచి రాష్ట్ర పోలీసులకు అందడంతో రాంగోపాల్‌పేట్‌ పోలీసులు ఈ నెల 12న కిమ్స్‌ ఆస్పత్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.

చికిత్స లోపం లేదు  
ఆస్పత్రి అందించిన చికిత్సలో ఎలాంటి లోపం లేదు. రోగి ఇప్పటికే కోర్టును ఆశ్రయించినందున మేము ఈ విషయంలో మేము ఎలాంటి వివరణ ఇవ్వలేము. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకుందాం  
–డాక్టర్‌ ప్రసాద్‌ ,కిమ్స్‌ ఆసుపత్రి డెంటల్‌ సర్జన్‌ 

మరిన్ని వార్తలు