మూడేళ్లయినా పింఛను ఇవ్వరా?

8 Jun, 2018 02:49 IST|Sakshi

మాజీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ధర్మరాజు కన్నీటిపర్యంతం

భార్యతో కలసి రిజిస్ట్రార్‌ చాంబర్‌లో బైఠాయింపు

తెయూ (డిచ్‌పల్లి): పదవీ విరమణ చేసి మూడేళ్లు గడుస్తున్నా పింఛను ఇవ్వకుండా తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలంగాణ యూనివర్సిటీ రిటైర్డ్‌ మాజీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ దర్మరాజు కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం తన భార్యతో కలసి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.శివశంకర్‌ చాంబర్‌లో బైఠాయించి నిరసనకు దిగారు. ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా క్యాంపస్‌ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా పింఛను మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

2008లో తెలంగాణ వర్సిటీలో విధుల్లో చేరిన తాను ఆంగ్ల విభాగం డీన్‌గా, ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌గా, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌గా, రిజిస్ట్రార్‌గా పని చేసినట్లు ధర్మరాజు వివరించారు. 2015 ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందిన తనకు న్యాయంగా రావా ల్సిన పింఛను ఇవ్వడం లేదన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు.

పింఛను టెన్షన్‌తో ఇటీవల గుండెకు స్టంట్‌ వేయించుకోవాల్సి వచ్చిందని అన్నారు. రిజిస్ట్రార్‌ శివశంకర్‌ పింఛను మంజూరు చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, ఉన్నత విద్యామండలి ఉన్నతాధికారులు స్పం దించి పింఛను మంజూరు చేయాలని అన్నారు.  

లీగల్‌ ఒపీనియన్‌కు పంపించాం: రిజిస్ట్రార్‌
2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఎవరికీ రాష్ట్ర ప్రభుత్వం పింఛను ఇవ్వడం లేదని రిజిస్ట్రార్‌ ప్రొ. శివశంకర్‌ తెలిపారు. 2006లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటైందని, ప్రొఫెసర్‌ ధర్మరాజుతో పాటు వర్సిటీలో చేరిన ఇద్దరు అధ్యాపకులు పింఛను రాదని తెలిసి తిరిగి మాతృసంస్థలకు వెళ్లి పోయారని తెలిపారు.

2015లో ధర్మరాజు పదవీ విరమణ పొందారు.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముగ్గురు వీసీలు, నలుగురు రిజిస్ట్రార్‌లు మారారు. ఉన్నత విద్యామండలి నుంచి ఆదేశాలు ఉంటే ఇప్పటికే పింఛను మంజూరయ్యేది కదా అని ఆయన చెప్పారు. తాను రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ధర్మరాజు పింఛను కోసం లీగల్‌ ఒపీనియన్‌కు పంపించానని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చి పాలకమండలి అనుమతిస్తే పింఛను మంజూరు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు