ఒక్క వాయిదాకు లక్షల్లో ఫీజులా?!

9 Sep, 2018 03:09 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్‌ వామనరావు

     హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వామనరావు 

     సీనియర్‌ న్యాయవాదులు పునరాలోచన చేయాలి 

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ఒక్కో వాయిదాకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున ఫీజులు వసూలు చేస్తుండటంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వామననావు అభ్యంతరం తెలిపారు. ఇలా భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తుండటంపై పునరాలోచన చేయాలని కోరారు. కోర్టులో కేసు విచారణకు రాకపోయినా ఫీజు తీసుకుంటున్నారని, ఈ తరహా దోపిడీ విధానానికి స్వస్తి పలకాలని కోరారు.  

ఢిల్లీలో రాజీకి వచ్చిన ఒక కేసులో రూ.30 లక్షల ఫీజు తీసుకున్నారని, ఈ విధానం కొనసాగితే రాజీకొచ్చిన కంపెనీల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల ప్రత్యామ్నాయ కేంద్రం (ఐసీఏఆర్‌డీ)–హైదరాబాద్‌ సెంటర్, తెలంగాణ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్తంగా ‘వాణిజ్య వివాదాల సత్వర పరిష్కారం–న్యాయ సంస్కరణలు’అనే అంశంపై సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కేసులో వాదనలకు ఒక్క వాయిదాకే రూ.లక్షలు వసూలు చేసే విధానాన్ని నియంత్రించాలని, ఈ తరహా న్యాయ సంస్కరణలు చాలా అవసరమని అన్నారు. వాది ప్రతివాదులు కేసును రాజీ చేసేందుకు మధ్య వర్తిత్వ వాదనలు ఫైవ్‌ స్టార్‌ హోటల్స్‌లో నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  

‘పేటెంట్‌ రైట్స్‌’పై శిక్షణ ఇవ్వాలి 
పేటెంట్‌ రైట్స్‌ గురించి మాట్లాడుతూ.. కింది కోర్టుల్లో చాలా మంది జడ్జీలకు ఈ అంశంపై అవగాహన లేదని, వారికి జ్యుడీషియల్‌ అకాడమీలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ వామనరావు అన్నారు.   ఐసీఏఆర్‌డీకి వచ్చిన కేసు మూడు నెలల్లో పరిష్కారం అవుతోందని, కేసులు రాజీ చేయడంలో ప్రపంచంలో భారత్‌ 145వ స్థానంలో ఉండేదని, సంస్కరణల ఫలితంగా 100వ స్థానానికి వచ్చిందని ఐసీఏఆర్‌డీ–హైదరాబాద్‌ కేంద్ర కార్యదర్శి జేఎల్‌ఎన్‌ మూర్తి చెప్పారు. గ్రామీణ జనాభాను దృష్టిలో పెట్టుకుని పేటెంట్‌ రైట్స్‌ తీసుకురావాలని వర్డిక్ట్‌ ఐపీ వ్యవస్థాపకుడు అశోక్‌ రామ్‌ కుమార్‌ అన్నారు.

సాఫ్ట్‌వేర్‌లో భారతీయులు, ప్రధానంగా తెలుగు వారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నా సాఫ్ట్‌వేర్‌పై పేటెంట్‌ రైట్స్‌ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పేటెంట్‌ రైట్స్‌ పొందడం వల్లే రెడ్డి ల్యాబ్స్‌ ఉత్పత్తి చేసిన మందును గత ఇరవై ఏళ్లుగా ఇతర దేశాలు ఉత్పత్తి చేయనీయకుండా అడ్డుకుందని, ఇదే తరహాలో గ్రామీణ స్థాయిలో పేటెంట్‌ రైట్స్‌ పొందాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పారు. సీఐఐ డైరెక్టర్‌ సుభజిత్‌ షా తదితరులు ప్రసంగించారు.

మరిన్ని వార్తలు