పెట్రోల్‌ పోసి కాలబెట్టాలె!

19 Nov, 2019 05:48 IST|Sakshi
మల్లికార్జున్‌ను ఆటోలో తరలిస్తున్న పోలీసులు

అధికారులపై బొమ్మకల్‌వాసి మండిపాటు

పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

కరీంనగర్‌ రూరల్‌: ‘‘నా భూమి కోసం 15 ఏళ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకుంటలేరు. అధికారులందరిని పెట్రోల్‌ పోసి కాలబెట్టాలె..’’అంటూ కరీంనగర్‌ మండలం బొమ్మకల్‌కి చెందిన బాధితుడు మల్లికార్జున్‌ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో హల్‌చల్‌ చేశాడు. రిటైర్డు ఎంఈవో మల్లికార్జున్‌కు బొమ్మకల్‌లో 3.24 గుంటల భూమి ఉంది. 15 ఏళ్ల క్రితం తన కుమారుడు విజయ్‌ పేరిట పాసుపుస్తకం ఎందుకిచ్చారని, తన భూమిని తనకే ఇవ్వాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నాడు. కొడుకు పేరిట రిజిస్ట్రేషన్‌ ఉండడంతో అధికారులు మిన్నకున్నారు. దీంతో సోమవారం జరిగిన ప్రజావాణికి వచ్చిన మల్లికార్జున్‌ రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డాడు. పదిహేనేండ్ల నుంచి తిరుగున్నా పట్టించుకోవడం లేదంటూ, అధికారులపై పెట్రోల్‌ పోసి కాలపెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మల్లికార్జున్‌ తీవ్ర పదజాలంతో అధికారులను దూషిస్తుండడంతో డీఆర్‌వో ప్రావీణ్య పోలీసులకు తెలిపారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్ధానిక నేతల విజ్ఞప్తి మేరకు మల్లికార్జున్‌ను విడిచిపెట్టారు.

మరిన్ని వార్తలు