బ్యాలెట్‌ బాక్సులను ఎడ్లబండ్లపై తరలించాము

23 Nov, 2018 12:36 IST|Sakshi
చిన్నయ్య, రిటైర్డ్‌ తహసీల్దార్‌  

పోలీసులు నడుస్తూ వాటికి కాపలాగా వచ్చేవారు

 పోలింగ్‌ స్టేషన్లకు గదులు సరిపోయేవి కావు  

తడకలు కట్టించే వాళ్లం 

డబ్బుల పంపిణీపై ఫిర్యాదులు అప్పట్లో లేవు 

ప్రస్తుతం ప్రలోభాల తీరు మారింది 

టైర్డ్‌ తహసీల్దార్‌ చిన్నయ్య 

దాదాపు 30 ఏళ్ల క్రితం చాలా గ్రామాలకు బ్యాలెట్‌ బాక్సులను ఎడ్ల బండ్లపై తరలించేవాళ్లం. పోలీసులు వాటివెంట నడుస్తూ రక్షణగా వచ్చేవారని రిటైర్డ్‌ తహసీల్దార్‌ చిన్నయ్య పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేది.. నాటికి నేటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సుదీర్ఘకాలం పాటు రెవెన్యూ శాఖలో పనిచేసి నాలుగు పర్యాయాలు ఎన్నికల విధులు నిర్వహించిన ఆయన అనుభవాలు తన మాటల్లోనే.

 సాక్షి,పరిగి 1969లో రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరాను. నా మొదటి డూటీ ఎలక్షన్‌ ఎల్‌డీసీగా ప్రారంభించాను. అనంతరం తహసీల్దార్‌ హోదాలో అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నాలుగు ఎన్నికల్లో పాలుపంచుకున్నాను. ఎన్నికల నిర్వహణ, సౌకర్యాలు, రవాణా తదితర అంశాల్లో అందే ఫిర్యాదులు ఇలా అనేక అంశాల్లో నాటితో పోలిస్తే నేడు చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం చాలా గ్రామాలకు జీపులాంటి వాహనాలు వెళ్లేందుకు రోడ్లు ఉండేవి కావు. దీంతో చాలా గ్రామాలకు బ్యాలెట్‌ బాక్సులను ఎడ్లబండ్లపై తరలించాల్సి వచ్చేది. పోలీసులు వాటికి కాపలాగా నడుచుకుంటూ వెనకాలే వచ్చేవారు. 

తడకలతో పోలింగ్‌ స్టేషన్లు .. 
చాలా గ్రామాల్లో పోలింగ్‌ బూతుల ఏర్పాటుకు గదులు కూడా ఉండేవి కాదు. స్కూల్‌ బిల్డింగుల్లో ఒకటో రెండో గదులు ఉండేవి. దీంతో  తాత్కాలికంగా తడకలతో గదులను ఏర్పాటు చేసేవాళ్లం. రాత్రిళ్లు నిద్రించేందుకు కూడా సిబ్బందికి గదులు ఉండేవి కావు. ఇక మహిళా సిబ్బంది కష్టాలు అన్నీఇన్ని కావు.   

రాత్రంతా సిబ్బందికి జాగారమే..  
ఇప్పుడు ఈవీఎంలు వచ్చాక పని విధానం చాలా సులభమైంది. వాటిని చెక్‌ చేసుకోవటానికి టెక్నికల్‌ పర్సన్లు కూడా ఉంటున్నారు. కాని అప్పట్లో ప్ర తి బ్యాలెట్‌ పేపర్‌ను చెక్‌ చేయాల్సి వచ్చేది. తప్పులు ఉన్న పేపర్లు ఏమైన ఉన్నా.. పేరు.. గుర్తులు ఏమైనా మారినా వాటిని ప్రత్యేకంగా లెక్క కట్టాల్సి వచ్చేది. వాటిపై ముందుగానే ముద్రలు వేసుకోవాల్సి వచ్చేది. దీంతో సిబ్బంది రాత్రిళ్లు నిద్ర కూడాపోయే వారు కాదు.  

మూడు రోజుల ముందే ఏర్పాట్లు  
అధికారులందరూ పోలింగ్‌కు మూడు రోజుల ముందే ఏర్పాట్ల కోసం గ్రామాల్లో శ్రమించాల్సి వచ్చేది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లోనే కౌంటింగ్‌ జరిగితే ఇంకా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఓట్లు లెక్కింపునకు టేబుళ్లు కూడా దొరికేవి కాదు. ఒక్కోసారి టేబుళ్లు కూడా టౌన్‌ నుంచి తీసుకు వెళ్లాల్సి వచ్చేది. గ్రామాల్లో కుర్చీలు కూడా ఉండేవి కాదు.  

అప్పట్లో ఎన్నికల ఖర్చు బాగా తక్కువ 
అప్పట్లో ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా బాగా తక్కువగా ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రూ. 5–15 లక్షలలోపు ఉండేది. ఇప్పుడు రూ. 1–1.5 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. అప్పట్లో సిబ్బందికి ఇచ్చే టీఏ, డీఏలు కూడా బాగా తక్కువగా ఉండేది.   

ప్రలోభాలు లేవు 
ప్రస్తుతం ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో డబ్బు, మద్యం పాత్ర చాలా తక్కువగా ఉండేది. డబ్బుల పంపిణీ, తరలింపు తదితర ఫిర్యాదులే వచ్చేవి కావు. గ్రామాల్లో కల్లు, అక్కడక్కడా గుడుంబా, సారా పంచుతున్నట్లు ఫిర్యాదులు వచ్చేవి. అప్పట్లో నాయకులు.. ఓట్లు వేయకుంటే మా పొలంలోంచి పశువులను వెళ్లనీయం. దారి మూసేస్తాం. టెనెన్సీ రద్దు చేయిస్తాం వంటి బెది రింపులకు పాల్పడేవాళ్లు.

టెక్నాలజీ పెరగడంతో పని సులువు 
ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులకు పని బాగా తగ్గింది. అప్పట్లో ఏది అవసరం ఉన్నా టైప్‌మిషన్‌పై క్లర్కులు రేసే కాగితాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. రూట్‌ మ్యాప్‌లు కూడా గీసుకునే వాళ్లం. ఇప్పుడంతా కంప్యూటర్‌మయం. ప్రతి కార్యాలయంలో ప్రింటర్లు, జిరాక్స్‌ మిషన్లు అందుబాటులో ఉంటున్నాయని విశ్రాంత తహసీల్దార్‌ చిన్నయ్య ఎన్నికల నిర్వహణపై నాటి తన అనుభవాలను పంచుకున్నారు.        

మరిన్ని వార్తలు